అస్త్రశస్త్రాలు.. వ్యూహ ప్రతివ్యూహాలు!

అస్త్రశస్త్రాలు.. వ్యూహ ప్రతివ్యూహాలు! - Sakshi

తారా స్థాయిలో నంద్యాల ఉప పోరు 

- చంద్రబాబు మోసాల్ని వివరిస్తూ జగన్‌ ప్రచారం

మళ్లీ హామీలు గుప్పించిన సీఎం 

పరాకాష్టకు చేరిన అధికార దుర్వినియోగం  

- నేటితో ప్రచారానికి తెర 

 

నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిష్టాత్మకంగా పరిణమించిన నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోరులో అధికార, ప్రతిపక్షాల మధ్య హోరెత్తుతున్న ప్రచారం తార స్థాయికి చేరుకుంది. ప్రచారానికి మరొక్క రోజే గడువు ఉండటంతో వైరి వర్గాలు తమ అస్త్రశస్త్రాలకు మరింత పదునెక్కించాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ.. ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మూడున్నరేళ్ల పాలనలో ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ మాయ మాటలు చెబుతూ నంద్యాల ఓటర్లకు గాలం వేస్తున్నారు.



ప్రజాబలం, వారి ఆదరణే అండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కుటిల నీతిని ఎండగడుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తరఫున జగన్‌ రంగంలోకి దిగి ప్రచారం సాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి పక్షాన ముఖ్యమంత్రితో పాటు లోకేశ్‌ మినహా యావత్‌ మంత్రివర్గం నంద్యాలలో మకాం వేసి తమ అధికార బలాన్ని ప్రయోగిస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రోడ్‌షో నిర్వహించారు. అడ్డదారి తొక్కైనా సరే విజయం సాధించాలనే తమ నేత ఆదేశాలను అక్షరాలా పాటించే దిశగా మంత్రులు వెళ్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక నేతలతో పాటు ఓటర్లనూ కొనుగోలు చేసేందుకు బరితెగిస్తున్నారు.

 

మళ్లీ హామీలు.. ప్రలోభాలు.. బెదిరింపులు..

అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. 2014 ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు, జిల్లాల వారీగా ఇచ్చిన హామీలు, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించారు. అప్పులు మాఫీ చేస్తామని రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలు.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. సీఎంగా కర్నూలు జిల్లాకు బాబు పలు హామీలు ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఇపుడు నంద్యాల ఉప ఎన్నిక రాగానే మళ్లీ హామీలు గుప్పిస్తూ ప్రజల ముందుకు వచ్చారు.



రోడ్ల వెడల్పు పేరుతో భవనాలు కూల్చేస్తూ దానినే అభివృద్ధిగా చూపుతూ ప్రచారం చేస్తున్నారు. ఎన్ని చేసినా నంద్యాల ప్రజలు నమ్మడం లేదని భారీ ఎత్తున ప్రలోభాల పర్వానికి తెర తీశారు. స్థానికంగా చిన్నా చితక నేతల కొనుగోలుకు రూ.కోట్లు గుమ్మరిం చారు. అదే రీతిలో ఓటర్లనూ కొనుగోలు చేయడానికి బరితెగించారు. ఇందుకు ససేమిరా అన్న వారి ఇళ్లపై పోలీసులతో దాడులు చేయించారు. దుష్ప్రచారానికీ ఒడిగట్టారు. రాష్ట్ర క్యాబినెట్‌ అంతా నంద్యాల్లోనే తిష్ట వేసి ఈ అరాచకాలు సాగిస్తోందంటే సర్కారు పెద్దలు ఎంతగా భయపడుతున్నారో తేటతెల్లమవు తోంది. వీటన్నింటినీ ఎండగడుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రచారం సాగించారు. పాలకుల మోసకారితనాన్ని తూర్పారబట్టారు. వైఎస్సార్‌సీపీ బరిలో లేకపోయుంటే నంద్యాలకు ఒక్క పైసా కూడా విదిల్చి ఉండేవారు కాదని స్థానికులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.  

 

ఆకట్టుకున్న ప్రతిపక్ష నేత ప్రచారం

మూడేళ్లలో ఒకే ఒక్కసారి నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి.. ఉప ఎన్నికలనగానే నెలన్నరలోపు మూడు సార్లు పర్యటించి వేడిని రాజేశారు. రంజాన్‌ నెలలో నాటకీయంగా ముస్లింలకు నంద్యాలలోనే ‘ఇఫ్తార్‌’ విందు ఇచ్చి రాజధానిలో ఇవ్వాల్సిన విందు సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. షెడ్యూలు వెలువడటానికి సరిగ్గా రెండు రోజుల ముందు వచ్చి ఒక రోజు పర్యటించి వెళ్లారు. తాజాగా ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో 19, 20 తేదీల్లో రోడ్‌షోలు, వివిధ వర్గాల సమావేశాల్లో పాల్గొని ప్రచారం చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌ ఈ నెల 3వ తేదీన ఎస్పీజీ మైదానంలో భారీ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించి హోరాహోరీ సమరానికి తెర లేపారు.



ఆరోజు ఆయన చేసిన ప్రసంగం అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంది. ఇది చూసి గుండెలదిరిన అధికారపక్షం నానా యాగీ చేసింది. ఆయన ప్రభుత్వంపై చేసిన ఏ విమర్శకూ అధికార పక్షం నుంచి సమాధానమే లేకుండా పోయింది. జగన్‌ తన రెండో విడత ప్రచారానికి 9వ తేదీన నంద్యాలకు చేరుకున్నారు. అప్పటి నుంచి ప్రచారం కొనసాగిస్తున్నారు. జగన్‌ తొలుత రోడ్‌షోలు నిర్వహించాలని భావించినప్పటికీ దారి పొడవునా వెల్లువెత్తుతున్న ప్రజాదరణ, వృద్ధులు, యువత, మహిళల స్పందన చూశాక అన్ని వీధుల్లోకి వెళ్లక తప్పలేదు.



తమ వీధిలోకి రావాల్సిందేనని, తమ ఇంట్లోకి రావాల్సిందేనని.. తమతో సెల్ఫీ దిగాల్సిందేనని పలువురు పట్టుబట్టడంతో అయన ఓపికగా అందరితో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో షెడ్యూలు ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలన్నీ బాగా ఆలస్యమ య్యాయి. ప్రతి రోజూ సుమారు 10 గంటల పాటు ఆయన ప్రజల మధ్యే గడిపారు. చంద్రబాబు మాత్రం రోడ్‌షో.. అధికారిక కార్యక్రమాలు, సమావేశాలకే పరిమితమై ప్రచారం సాగించారు. కాగా, సోమవారంతో ప్రచార పర్వానికి తెర పడనుంది. బుధవారం పోలింగ్‌ జరగనుంది. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top