ప్రచారం పరిసమాప్తం


► నంద్యాలను విడిచిన ‘బయటి’ నేతలు

►  రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం

► పోలీస్‌ శాఖ భారీ బందోబస్తు  




నంద్యాల విద్య: నంద్యాల ఉపఎన్నిక ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. గత నెల 29 వతేదీన ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైన విషయం విదితమే. ఆగస్టు 5వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. వాటి ఉపసంహరణకు ఆగస్టు 9 వతేదీ గడువు విధించారు. తొమ్మిది మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు.


రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రథమశ్రేణి, ద్వితీయశ్రేణి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రచారాలకు నాయకత్వం వహించారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రజలకు అందించడంలో మీడియా హడావుడి కనిపించింది. అధినాయకుల సభలు, ప్రసంగాలు, రోడ్‌షోలతో నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధులు హోరెత్తాయి. అ«ధికార, ప్రతిపక్ష నేతలు ఆకట్టుకొనే ప్రసంగాలతో ప్రచారం చేశారు. వేలాది మంది కార్యకర్తలతో, జెండాలతో పట్టణంలో సందడి వాతావరణం కనిపించింది.


ప్రచారాలు సోమవారం సాయంత్రానికి పూర్తికావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు నంద్యాలను వీడారు. ఇదిలా ఉండగా.. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా నలుగురు పరిశీలకులను నియమించింది. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. బుధవారం జరిగే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.       

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top