ఒక నాయకుడు పోతే వంద మంది వస్తారు

ఒక నాయకుడు పోతే వంద మంది వస్తారు - Sakshi


వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

 

వాకాడు : పార్టీ నుంచి ఒక నాయకుడు పోతే వందమంది నాయకులు పుడతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. వాకాడులోని పార్టీ సీజీసీ సభ్యులు డాక్టర్ నేదుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం వాకాడు, చిట్టమూరు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రసన్న సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గూడురు ఎమ్మెల్యే సునీల్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రన పాపారెడ్డిజ్‌కుమార్‌రెడ్డి పార్టీని వీడటం సరికాదన్నారు. నాయకులు పార్టీ వీడినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. కార్యకర్తలకు, నాయకులకు తమ పార్టీలో కొదవలేదన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్ట్టి టీడీపీలో చేర్చుకున్నా జగన్‌న్ను ఏం చేయలేరన్నారు. అధికార పార్టీని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరంలేదన్నారు. త్వరలోనే నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

 వారం రోజుల్లో బయటపెడతా

 చిల్లకూరు మండలంలో పార్టీని వీడి టీడీపీలో చేరిన ఓ నాయకుడు 590 ఎకరాలు ఆక్రమించి సిలికా వ్యాపారం చేస్తూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారన్నారు. వారం రోజుల్లో పూర్తి ఆధారాలతో ఆ నాయకుడు బండారం బయటపెడతామన్నారు. సీఎం చంద్రబాబుకు నిజయితీ ఉంటే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా సిలికా వ్యాపారం చేస్తున్న ఆ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. వైఎస్ జగన్ మహాశక్తి ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.నందగోపాల్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి పోకల దుష్యంతయ్య శెట్టి, జిల్లా అధికార ప్రతినిధి చలపతిరావు పాల్గొన్నారు.

 

 విజయసాయిరెడ్డికి సముచితస్థానం

 

 వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపికచేయడం సముచితమని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. మాట మీద నిలబడతారు, నమ్ముకున్న వారికి ద్రోహం చేయరనేందుకు నిదర్శనం ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబమేనన్నారు. పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న విజయసాయిరెడ్డిని ఎంపిక చేసినందుకు జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నాయన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top