నకిలీల హల్‌చల్


కావలి: జిల్లాలో నకిలీ అధికారులు హల్‌చల్ చేస్తున్నారు. అమాయక మహిళలు, వ్యాపారులు, వాహనదారులు, చిరుద్యోగులే టార్గెట్‌గా వల విసిరి దొరికిన మొత్తంతో పరారవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇలాంటి మోసాలకు ప్రభుత్వ ఉద్యోగులూ పాల్పడటం చూసి జనం అవాక్కవుతున్నారు.

 

  ఏడాది కిందట ఐపీఎస్ అధికారినంటూ వచ్చిన ఓ వ్యక్తి కావలి ముసునూరులో ఓ విశ్రాంత సైనిక ఉద్యోగి ఇంట్లో బంగారు నగలను దోచుకుని వెళ్లగా తాజాగా డిప్యూటీ కలెక్టర్‌నంటూ జలదంకి మండలం గట్టుపల్లి పీహెచ్‌సీ పరిధిలోని తిమ్మసముద్ర ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేస్తూ పోలీసులకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడిన విషయం తెలిసిందే. వారిలో మొగరాల ప్రసాద్ కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడు. ఇతనిపై నెల్లూరు ఐదో నగరం, ఓజిలి, నాయుడుపేట స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నాయి. అలాగే అతనితోపాటు పట్టుబడిన కిషోర్‌కుమార్ ఉదయగిరి ట్రెజరీలో పనిచేస్తున్నాడు.

 

 పట్టుబడింది ఇలా..

 మొగరాల ప్రసాద్, కిషోర్‌కుమార్‌లు మరోవ్యక్తితో కలిసి గత నెల 14న తిమ్మసముద్రం ఆరోగ్య ఉపకేంద్రానికి వెళ్లి డిప్యూటీ కలెక్టర్‌నంటూ హల్‌చల్ చేశారు. రికార్డులు తనిఖీ చేసి సరిగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే భారీగా నగదు ఇవ్వాలని బెదిరించారు.

 

 దీంతో వైద్యసిబ్బంది మిన్నకుండిపోయారు. నకిలీలు ఓ ఫోన్ నంబర్ ఇచ్చి మరలా వస్తామని అప్పటికి నగదు సిద్ధం చేయాలని చెప్పి వెళ్లారు. కాగా అక్కడ పనిచేస్తున్న ఓ నర్సుకు వచ్చినోళ్లలో ఒకరు బంధువుకావడంతో అతనిని గుర్తించింది. విషయాన్ని వైద్యునికి తెలిపింది. వారు వెంటనే కావలి డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఆ మేరకు ఇద్దరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు.

 

 అమాయకులే లక్ష్యం..

 నకిలీలు ప్రజల అమాకత్వాన్ని, మంచితనాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీలు చేసిన సంఘటలు చాలా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం కావలిలోని బృందావనం కాలనీలో విజిలెన్స్, పోలీసు అధికారులమంటూ ఓ ఇంట్లో తనిఖీలు చేస్తున్నట్లు నటించి సుమారు 50 సవర్ల బంగారు నగలు, మూడు కేజీల వెండి వస్తువులు, రూ. 3.5 లక్షల నగదును దోపిడీ చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం కమర్షియల్ ట్యాక్స్ అధికారి నంటూ కావలి, కోవూరులో పలు దుకాణాలలో ఓ అధికారి తనిఖీల పేరిట నగదు వసూలు చేశారు. తర్వాత అతడిని పోలీసులు అరెస్టు చేసి అతను వాడిన కారును సీజ్ చేశారు. అదేసమయంలో తమిళనాడు ఐఏఎస్ అధికారినంటూ చిత్తూరు జిల్లా పుంగనూరు చెందిన మునిరాజ్ వచ్చి ముసునూరులోని ఓ ఇంట్లో 40 సవర్ల వరకు బంగారాన్ని తస్కరించి వెళ్లగా అతన్ని కావలిరూరల్ పోలీసులు పట్టుకున్నారు. మునిరాజ్ ఒంగోలులోనూ ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు. ఇంతేకాకుండా అప్పుడప్పుడు కావలి పరిసర జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులమంటూ కొందరు వాహనాలను ఆపి మామూళ్లు వసూలు చేస్తుండగా పోలీసులు వెళ్లడంతో వారు పరారైన ఘటలూ ఉన్నాయి.

 

  ఇలా డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు మోసగాళ్లు అధికారులమంటూ ప్రజలను దోచుకుంటున్నారు. వారి మోసాల బారిన పడకుండా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరిపైనైనా ఆనుమానం వస్తే వారిని మాటల్లో పెట్టి వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కో, 100 నంబర్‌కో ఫోన్ చేయాలని పోలీసులు చెబుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top