రెండుకళ్ల సిద్ధాంతం చంద్రబాబు నైజం

రెండుకళ్ల సిద్ధాంతం చంద్రబాబు నైజం - Sakshi


 బాబు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్లే ముద్రగడ దీక్ష

 బీసీ జాబితా నుంచి వెనుకబడిన కులాలను తొలగిస్తున్న కేసీఆర్

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని


శ్రీకాకుళం అర్బన్:  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చే విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విషయాన్ని రెండుకళ్ల సిద్ధాంతంతో చూడడం బాబుకు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సందర్భంగా కాపులను బీసీల్లో చేరుస్తామని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ. వెయ్యి కోట్లు నిధులు విడుదల చేస్తామని చంద్రబాబే స్వయంగా ప్రకటించారన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా హామీ అమలు చేయలేదన్నారు.





కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ రెండేళ్లలో రూ. 200 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. తమకు న్యాయం జరగదని గ్రహించిన కాపులంతా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంనాయకత్వంలోఉద్యమించారన్నారు. 1966 వరకూ తెలగకులస్తులంతా బీసీల్లోనే ఉండేవార ని, తర్వాత తొలగించారన్నారు. తొలగించిన వారిని మరలా బీసీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారన్నారు. వారి న్యాయమైన డిమాండ్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు తెలుపుతోందన్నారు. మాల-మాదిగ రిజర్వేషన్ల ప్రక్రియలో, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన బాబు ఇప్పుడు కాపులు-బీసీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అదే విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు.





తెలంగాణలో వెనుకబడిన కులాలను బీసీ జాబితా నుంచి కేసీఆర్ తొలగిస్తున్నారని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునిగా కృష్ణయ్య అక్కడ పోరాటం చేయాలన్నారు. ఇక్కడి బీసీలకు అన్యాయం జరిగితే పోరాడేందుకు ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారన్నారు. ఇటీవల తునిలో నిర్వహించిన కాపు గర్జనకు అనూహ్య స్పందన రావడంతో పాలకపక్షంలోని టీడీపీ నాయకులు సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహించి ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు హింసాత్మక ఘటనగా మార్చారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు టొంపల సీతారాం, పార్టీ నేతలు సనపల నారాయణరావు, పసగడ రామకృష్ణ, పాలిశెట్టి మధుబాబు, తెలగ సంఘ నేతలు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top