ప్రాణం తీసిన టీచర్ వేధింపులు

ప్రాణం తీసిన టీచర్ వేధింపులు - Sakshi


రామవరప్పాడు :  ఓ టీచర్ వేధింపులతో పన్నెండేళ్లకే ఆ పాపకు నూరేళ్లు నిండిపోయాయి.  టీచర్ మందలించిందన్న  కారణంతో ఆ విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం రామవరప్పాడులో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని అన్నపూర్ణదేవి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యాలం రామారావు, లక్ష్మీ దంపతులు తమ ముగ్గురు కుమారైలతో  రామవరప్పాడులోని గొళి కృష్ణయ్య వీధిలో నివాసం ఉంటున్నారు.  పెద్ద కుమార్తె ప్రవల్లిక టీటీసీ చేస్తుండగా, రెండవ కుమార్తె ప్రియాంక ఇంటర్ చదువుతోంది. చిన్న కూతురైన నాగసత్యభార్గవి రామవరప్పాడులోని ఓ  ప్రయివేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా తమ చిన్నారి కుమార్తె అకాల మృతితో రామారావు  దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

 

అసలేం జరిగింది..

ఎప్పటి లాగానే భార్గవి ఉదయం పాఠశాలకు వెళ్లింది. క్వార్టర్లీ తెలుగు పరీక్ష రాస్తూ మధ్యలో బాత్‌రూంకు వె ళ్లాలంటూ టీచర్‌ను అడిగింది. టీచర్ అంగీకరించడంతో భవనం కింద ఉన్న మరుగుదొడ్లకు వెళ్ల్లకుండా సరాసరి భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి కుడి వైపుగా కిందకు దూకేసింది. జరిగిన హఠాత్ పరిణామానికి ఏమి జరిగిందో అర్థం కాక పాఠశాలలోని సిబ్బంది కిందకు వచ్చి చూశారు. రక్తం మడుగులో పడి ఉన్న భార్గవిని  ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించేలోపే మరణించింది.

 

టీచర్ వేధింపులే కారణం....

పాఠశాలలోని తెలుగు టీచర్ వేధింపులే  తమ బిడ్డను ఆత్మహత్యకు పురిగొల్పాయని  భార్గవి తల్లిదండ్రులు ఆరోపించారు.  ఇటీవల  పాఠ్యాంశంలో ఏదో సందేహం అడగడంతో తెలుగు టీచర్ కోప్పడిందని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైందని తెలిపారు.  అకారణంగా టీచర్ తిట్టడంతో భార్గవి  తమకు చెప్పి బాధపడిందని వీరు తెలిపారు. పైగా అంతటితో ఆగకుండా  తోటి విద్యార్థులు   భార్గవితో మాట్లాడవద్దని టీచర్ హుకుం జారీ చేసిందని... దీంతో  విద్యార్థులు భార్గవితో మాట్లాడటం మానేశారని చెప్పారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదవను తనను వేరే పాఠశాలలో చేర్పించండని పదే పదే భార్గవి తమను అడిగేదని తెలిపారు. వచ్చే సంవత్సరం తనకు నచ్చిన పాఠశాలలో చేర్పిస్తామని, అప్పటి వరకూ ఈ పాఠశాలలోనే చదువుకోవాలంటూ నచ్చ చెప్పడంతో ఇష్టం లేకపోయినా పాఠశాలకు వెళ్తుందని తెలుపుతూ కన్నీరు మున్నీరయ్యారు.

 

బాత్‌రూంలో జారి పడిందని చెప్పారు

 -తండ్రి యాలం రామారావు


ఇంత జరిగినా పాఠశాల యాజమాన్యం  నిర్లక్ష్య ధోరణి అవలంబించిందని తండ్రి రామారావు ఆరోపించారు. సాయంత్రం 3.30 గంటల సమయంలో పాఠశాల నుంచి మీ కుమార్తె కాలు జారి బాత్ రూంలో పడడంతో ఆయుష్ ఆస్పత్రికి తీసుకెళ్లామని ఫోన్ చేసి చెప్పారన్నారు.  తీరా ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యంలో...మీ పాప భవనంపై నుంచి పడిందని మరళా ఫోన్ చేసి చెప్పారని చెప్పారు. భార్గవి చిన్నతనం నుంచి అన్ని తరగతుల్లో ఫస్టు ఉండేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అన్నారు.

 

విద్యార్థి సంఘాల  ఆందోళన ...

పాఠశాల నిర్లక్ష్యంతోనే విద్యార్థి నిండు ప్రాణాలు పోయాయని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. భార్గవి మృతదేహంతో ఉన్న అంబులెన్స్‌ను కదలనివ్వకుండా రోడ్డుపై బైఠాయించి  నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top