'నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పు'

'నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పు' - Sakshi


- వచ్చే నెల 2న గుంటూరులో మహా దీక్ష

-దీక్ష విజయవంతంపై నేతలతో చర్చించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి



హైదరాబాద్‌ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో మహా దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ దీక్షను విజయవంతం చేసే విషయమై ఆదివారం రఘువీరా హైదరాబాద్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రాష్ట్రానికి మోసం చేయడం దారుణమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  



భారతీయ జనతాపార్టీనే ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోందని మొదట్లో భావించామని అయితే చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో టీడీపీ, బీజేపీ ఎంపీలతో సమావేశమై ప్రత్యేక హోదా గురించి ఇక మరచిపోండని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అంటూ వారికి హితబోధ చేయడాన్ని బట్టి చూస్తే బాబు... ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన విషయం బహిర్గతమైందన్నారు.




చంద్రబాబు, మోడీ జోడీ అద్భుతం అంటూ ఇటు టీడీపీ అటు బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం మినహా రాష్ట్ర ప్రయోజాలను కాపాడే చర్యలేవీ చేపట్టలేదనే విషయాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలని ప్రార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు మాత్రం విభజన అడ్డగోలుగా చేశారని, తెలంగాణలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని పట్టుకుని వేళాడుతున్నాడని ఎద్దేవా చేశారు.


ప్రత్యేక హోదా సాధిస్తే తెలుగుదేశం పార్టీకే మంచి పేరు వస్తుంది తప్ప కాంగ్రెస్‌కు కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో ఏడాదికి లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 5 లక్షల కోట్లు వస్తే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనంతగా ఆంధ్రప్రదేశ్ ముందుంటుందన్నారు.



మాట్లాడితే ప్రత్యేక హోదా విషయమై చట్టంలో ఎందుకు పొందుపరచలేదని టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని దేశంలో ఇప్పటి వరకు ప్రత్యేక హోదా కల్పించి అన్ని రాష్ట్రాల్లో కూడా చట్టం చేయడం వల్ల రాలేదని కేవలం కేబినెట్ నిర్ణయాలతోనే ప్రత్యేక హోదా ఇచ్చాన్నారు. నాయకులు, కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అని మిగిలిన పార్టీలకు ఆ శక్తి లేదని మహబూబ్‌నగర్ జిల్లా బహిరంగ సభలో చంద్రబాబు వెల్లడించడాన్ని ఆయన తప్పు పట్టారు.


నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పాలంటూ చంద్రబాబును ప్రశ్నించారు. దీక్ష విజయవంతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు కేవీపీ రామచంద్రారావు, సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top