ముత్యపుపందిరిలో నందగోపాలుడు

ముత్యపుపందిరిలో నందగోపాలుడు


సాక్షి, తిరుమల: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై నవనీతచోరుడు నందగోపాలుడి రూపంలో శ్రీవారి భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్పకు జరిగే సుకుమార సేవగా ముత్యపు పందిరి వాహన సేవను చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం వంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా అశేష భక్తజన గోవింద నామాల నడుమ ముత్యాలు పందిరి గా రూపొందించిన వాహనంలో నవనీత చోరుడు నందగోపాలుడి రూపంలో స్వామి ఆశీనులయ్యారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పురవీధుల్లో వైభవంగా ఊరేగారు.



వాహన సేవలో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. అంతకు ముందు ఉదయం ఆలయ వీధుల్లో మలయప్ప ధ్యానముద్రలో యోగ నృసింహ రూపంలో భక్తులను కటాక్షించారు. యోగశాస్త్రంలో సింహం శీఘ్ర గమన శక్తికి నిదర్శనంగా భావిస్తారు. భవ బంధములనే ప్రపంచ మాయను దాటి ముక్తిని పొందడానికి యోగసాధన ఒక్కటే మార్గమని సింహ వాహన సేవలో యోగముద్ర రూపం ద్వారా స్వామి తెలియజేస్తాడు.



భక్తుల గోవింద నామాలు, మంగళవాయిద్యాలు, పండితుల వేద ఘోష మధ్య సింహ వాహన సేవ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సాగింది. సాయంత్రం రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయల ఊగుతూ దర్శనమిచ్చారు. అనంతరం స్వామికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహించారు. వాహనసేవలో టీటీడీ సాధికారిక మండలి అధ్యక్షులు జగదీష్‌చంద్రశర్మ, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

 

ఆలయంలో తిరుమంజన వేడుక



బ్రహ్మోత్సవాల్లో తొలి మూడు రోజులు ఆలయంలో తిరుమంజనం నిర్వహించటం ఆలయ సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తిరుమంజనం వైభవంగా సాగింది. రంగనాయక మండపాన్ని పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో అలంకరించారు. పెద్ద జీయర్, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top