యువతిపై ప్రియుడి హత్యాయత్నం


దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు

హత్యాయత్నం, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు


 

గుంటూరు ఈస్ట్ : యువతిపై ఆమె ప్రియుడు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం గుంటూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది. లాలాపేట సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం నల్లచెరువు జీరో లైనులో నివసించే చెంచేటి మణికంఠ నగరంలోని ఓ బంగారు తయారీ షాపులో పనిచేస్తుంటాడు. మణికంఠ తనతో పాటు పదో తరగతి చదివిన నల్లచెరువు 8వలైనుకు చెందిన కారసాల విజయతో గతేడాది ఆగస్టు నెలలో ప్రేమ వ్యవహారం ప్రారంభించాడు. మణికంఠకు అప్పటికే కొత్తపేటకు చెందిన శివపార్వతితో వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది.



ఈ  సంగతి ప్రియురాలు విజయ వద్ద గోప్యంగా ఉంచాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కారణంగా కాకుమానులోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విజయ గత సంవత్సరం చదువుమానేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.  విజయ తండ్రి రాజు తన కుమార్తె కనిపించకుండా పోయిందని కాకుమాను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నల్లచెరువుకు సమీపంలోని శ్రీనివాసరావుతోటలో ఇద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసి మణికంఠ భార్య శివపార్వతి ఈనెల 5వ తేదీన కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.



వెంటనే స్పందించిన పోలీసులు మణికంఠ, విజయలను ఇరు కుటుంబాల  పెద్దలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి విజయను ఆమె తల్లిదండ్రుల వెంట పంపించారు. ఈనెల 18వ తేదీ రాత్రి మణికంఠ మేడమీద నిద్రిస్తున్న విజయను కలిసేందుకు యత్నించాడు. ఇంట్లోని వారు గమనించి కేకలు వేయడంతో  పరారయ్యాడు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేడమీద నిద్రిస్తున్న విజయను లేపి తనతో రావాల్సిందిగా కోరాడు.



ఆమె నిరాకరించి ప్రతిఘటించింది. దీంతో  కత్తితో విజయపై దాడిచేసి చేతిపై తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. మణికంఠను అబ్దుల్లా అనే వ్యక్తి అడ్డుకోగా అతనిని కూడా గాయపరిచాడు. స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మణికంఠ బ్యాగులో బట్టలతోపాటు, సుమారు రూ. 2 లక్షల డబ్బు ఉండడాన్ని  గుర్తించారు. మణికంఠపై హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top