తండ్రి జైలు నుంచి విడుదల కావాలని...

తండ్రి జైలు నుంచి విడుదల కావాలని... - Sakshi


ఒంగోలు: చిన్నపాటి గొడవలో తండ్రి జైలుపాలయ్యాడు. తమ ఇలవేల్పు అయిన తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి మొక్కుకుంటే తండ్రి జైలు నుంచి బయటపడతాడని భావించిన ఆ 13 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రెలైక్కి ముంబయి నుంచి తిరుపతికి వచ్చింది. అక్కడ నుంచి కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రైలులో వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయింది.



ముంబయికి చెందిన విజయవిఠల్ కథమ్ పప్పుధాన్యాలు తయారు చేసే కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో విజయవిఠల్ కథమ్ జైలు పాలయ్యాడు. అతని కుమార్తె అక్షద విజయకథమ్ (13) 8వ తరగతి చదువుతోంది. తన పదేళ్ల వయసులో తండ్రితో కలిసి కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. మళ్లీ ఆస్వామిని వేడుకుంటే తన తండ్రి జైలు నుంచి విడుదలవుతాడ న్న నమ్మకంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నాలుగు రోజుల క్రితం ముంబయి నుంచి రైలులో నుంచి తిరుపతి చేరుకుంది. కాలినడకన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని కొండపై మూడు రోజులు ఉండి తిరుగు ప్రయాణమైంది.



ఏ రైలు ఎక్కిందో..ఏమోగానీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో మంగళవారం సాయంత్రం దిగింది. నీరసంగా ప్లాట్‌ఫాంపై ఉన్న ఆ బాలికను రైల్వే జీఆర్‌పీ పోలీసులు గుర్తించి ఒంగోలు జీఆర్‌పీ సీఐ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. బాలికను ఒంగోలు రైల్వేస్టేషన్‌కు మంగళవారం రాత్రి తీసుకొచ్చారు. బుధవారం బాలల సంక్షేమ మండలి చైర్మన్ ముందు హాజరుపరిచి బాలసదన్‌లో చేర్పించారు. బాలిక చెప్పిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top