బహుళజాతి సంస్థలకు ప్రభుత్వం దాసోహం

బహుళజాతి సంస్థలకు ప్రభుత్వం దాసోహం


ఎమ్మెల్యేలు అనిల్,కోటంరెడ్డి విమర్శ



నెల్లూరు (సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు దాసోహమైందని నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపించేది బడావ్యాపార సంస్థలే అని ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఇన్సూరెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం స్థానిక దర్గామిట్టలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద  లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.



వీరి ఆందోళనకు ఎమ్మెల్యేలిద్దరూ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బహుళజాతి కంపెనీలకు దేశాన్ని ధారాదత్తం చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని మండిపడ్డారు. బడావ్యాపారుల చెప్పులు తుడిచేందుకు కూడా కొందరు వెనుకాడడం లేదని దుయ్యబట్టారు. కేంద్రం ప్రవేశ పెట్టనున్న ఇన్సూరెన్స్ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. ఏజెంట్ల వల్లే ఈ రోజు ఎల్‌ఐసీ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు.



ఏజెంట్లకు అన్యాయం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. రిలయన్స్ సంస్థ నెల్లూరులో దాదాపు 53 సెల్‌టవర్స్ నిర్మాణాలు చేపట్టబోతోందన్నారు. వీటి వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఆలోచించకుండా అనుమతులు ఇచ్చి, పోలీసుల అండతో వాటిని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గపు చర్యగా కోటంరెడ్డి అభివర్ణించారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎల్‌ఐసీని ఏజెంట్లు సొంత సంస్థగా చూసుకుంటూ ముందుకు నడుపుతున్నారన్నారు.



అలాంటి వారికి అన్యాయం జరిగితే వారికి మద్దతుగా ఎంత వరకైనా పోరాటాలకు సిద్ధంగా ఉంటామన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ మన దేశాన్ని అవమానపరచడం బాధాకరమని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒకాయన రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తామంటూ రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారన్నారు.  భారతదేశంలో ఎంతో మంది నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఉన్నారని, వారిని ప్రోత్సహించకుండా ఇతర దేశాలకు రూ.1200 కోట్లు కట్టబెట్టడం మానుకోవాలని హితవు పలికారు.



ఈ దేశంలో సామాన్యుడు కూడా ప్రధాని కాగలరని, అయితే    ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం బహుళజాతి కంపెనీలే అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ, సీపీఎం నాయకులు రామరాజు, అజయ్‌కుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు సతీష్‌బాబు, సుబ్బారావు, పలు అసోసియోషన్ల నాయకులు మద్దతు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top