ప్రమాదంలో పట్టు!

ప్రమాదంలో పట్టు! - Sakshi


- బోర్లలో నీళ్లు రాక 10 వేల ఎకరాల్లో ఎండిన మల్బరీ తోటలు

- గూళ్లకూ గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులు

- 50 శాతం తగ్గిన పట్టుగూళ్ల దిగుబడి...రూ.200 కోట్ల నష్టం

అనంతపురం అగ్రికల్చర్ :
పెనుకొండ మండలం మహదేవపల్లిలో 45 మంది రైతులు 78 ఎకరాల్లో మల్బరీ సాగు చేసేవారు. నెలకు సరాసరి 3,150 కిలోల పట్టుగూళ్లు పండించేవారు. ఏడాదికి కాస్త అటూఇటుగా రూ.1.10 కోట్ల ఆదాయం పొందేవారు. దీనివల్ల వారి జీవనం సాఫీగా సాగేది. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. వర్షాల్లేక భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయి. ఉన్నఫలంగా 30 బోరుబావులు ఎండిపోయాయి. మల్బరీ విస్తీర్ణం 78 ఎకరాల నుంచి కేవలం ఆరు ఎకరాలకు పడిపోయింది.

 

ఈ ఒక్క గ్రామంలోనే కాదు.. కనగానపల్లి మండలం వేపకుంట, లేపాక్షి మండలం కోడిపల్లి, నల్లమాడ మండలం కుటాలపల్లి, అమడగూరు మండలం కంచరవాండ్లపల్లి, తలమర్లవాండ్లపల్లి, నల్లచెరువు మండలం కడపలవాండ్లపల్లి, గుడిబండ మండలం మోరుబాగల్, బీటీ పల్లి, మడకశిర మండలం ఉప్పార్లపల్లి, దొడ్డేపల్లి, సుంకిరెడ్డిపల్లి... ఇలా అనేక గ్రామాల్లో  బోర్లలో నీరు రాక  పట్టు (మల్బరీ) సాగు ప్రమాదంలో పడింది. కూరగాయలు, స్వల్పకాలిక పండ్లతోటల మాదిరిగా కాకుండా మల్బరీ సాగు చేసే రైతులు రేషం షెడ్లు, రేరింగ్‌స్టాండ్, ఇతర సామగ్రి కోసం రూ.లక్షలు ఖర్చు చేసివుంటారు. ఒకసారి పుల్ల నాటుకుంటే పదేళ్ల పాటు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని కోసం ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. ఉన్నఫలంగా తోటలు ఎండిపోతుండడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు.

 

10 వేల ఎకరాలు ఎండుముఖం

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది వేల ఎకరాల్లో మల్బరీ తోటలు ఎండిపోయాయి. పట్టుపరిశ్రమశాఖ తయారు చేసిన అధికారిక నివేదిక ప్రకారమే హిందూపురం డివిజన్‌లో 856 ఎకరాలు, మడకశిర 506 , పెనుకొండ 683, ధర్మవరం 222, కళ్యాణదుర్గం 172, అనంతపురం డివిజన్‌లో 72 ఎకరాలు.. ఇలా జిల్లాలో 7,560 ఎకరాల మల్బరీ ఎండిపోయింది. అనధికారిక గణాంకాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ విస్తీర్ణం  పదివేల ఎకరాలకు పైమాటే.

 

రూ.200 కోట్లకు పైగా నష్టం

రాష్ట్రంలో మల్బరీ అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది మన జిల్లాలోనే.  ఇప్పుడు దీని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాతాళ గంగమ్మ సగటున 22 మీటర్ల లోతుకు పడిపోవడంతో బోర్ల నుంచి గుక్కెడు నీరు రావడం గగనమైంది. జిల్లాలో 70-80 వేల బోర్లు ఎండిపోయాయి. దీనివల్ల మల్బరీపై ఆధారపడిన 30 వేల మంది రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. జిల్లాలో 29,298 ఎకరాల్లో మల్బరీ తోటలు ఉండగా.. ఇప్పుడు పది వేల ఎకరాల్లో ఎండిపోయాయి. నీరు, పోషకాలు సరిగా లేక ఆకులో నాణ్యత కూడా తగ్గింది. ఫలితంగా ఏడాదికి 5 నుంచి 6 పంటలు రావాల్సివుండగా 3 నుంచి 4 పంటలకు పరిమితమయ్యాయి. పట్టుగూళ్ల దిగుబడులు 50 శాతం తగ్గడంతో రైతులు ఏడాదికి రూ.200 కోట్లకు పైగా నష్టపోతున్నారు.  

 

ధరలూ దారుణం

పట్టుగూళ్లకు కూడా ధరలు సగానికి పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. సీబీ (పచ్చరకం) గూళ్లు కిలో రూ.100 నుంచి రూ.120, బైవోల్టీన్ (తెల్లగూళ్లు) కిలో రూ.175 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. దీనివల్ల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2010-11 ఆర్థికసంవత్సరంలో సీబీ గూళ్లు కిలో రూ.350 , బైవోల్టీన్ రూ.400 పైగా పలికాయి. నాలుగేళ్లు ధరలు స్థిరంగా కొనసాగడంతో లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతో అనేకమంది రైతులు మల్బరీ వైపు దృష్టి సారించారు. 2014 ఎన్నికల తర్వాతే పట్టురైతులకు సమస్యలు మొదలయ్యాయి. ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగితే పట్టుసాగుకు కేంద్ర బిందువుగా ఉన్న ‘అనంత’ అట్టడుగుస్థాయికి చేరుకునే ప్రమాదముంది.

 

రైతుల పరిస్థితి ఇబ్బందిగానే ఉంది- సి.అరుణకుమారి, జేడీ, పట్టుపరిశ్రమశాఖ జిల్లాలో పట్టు రైతుల పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది. ఒకపక్క బోరుబావులు ఎండిపోయి తోటలు వదిలేస్తున్నారు. మరోపక్క నిలకడలేని ధరలు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా సీబీ గూళ్లు కిలోకు రూ.10, బైవోల్టిన్ గూళ్లకు రూ.50 ప్రకారం ఇన్సెంటివ్ ఇస్తున్నాం. రాయితీ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో మల్బరీ సాగులో ‘అనంత’ను అగ్రస్థానంలో నిలిపాం. మహదేవపల్లి, వేపకుంట, కోడిపల్లి లాంటి అనేక గ్రామాల్లో ఏళ్ల తరబడి పెంచుకున్న తోటలు వదిలేశారు. జిల్లాలో నెలకొన్న దారుణ పరిస్థితులను ఈనెల 27న జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. మహదేవపురంలో ఎండిన మల్బరీ తోటలను చూపించాం. తక్షణ సాయంగా రూ.44 కోట్లతో నివేదిక సమర్పించాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top