ముద్రగడకు మద్దతుగా ప్లేట్లు కొట్టి నిరసన


అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలోని పలుచోట్ల ఆదివారం కాపు నాయకులు గరిటెలతో ప్లేట్లుకొట్టి నిరసన తెలిపారు. అవనిగడ్డలో టీటీడీ కల్యాణ మండపం ఎదుట దీక్షా శిబిరం వద్ద నాయకులు ప్లేట్లను గరిటెలతో కొట్టి నిరసన తెలిపారు. పలువురు కాపు నేతలు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ పోరాటం ఆగదన్నారు. గాంధేయ మార్గంలో దీక్షలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. రెండు చేతులు లేని పెయింటర్ యలవర్తి వెంకటేశ్వరరావు ప్లేటు కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు సింహాద్రి వెంకటేశ్వరరావు, బాడిగ నాంచారయ్య, కొండవీటి కిశోర్, న్యాయవాది రాయపూడి వేణుగోపాల్, అలపర్తి గోపాలకృష్ణ, పద్యాల వెంకటేశ్వరరావు, దేవనబోయిన అంజిబాబు, తోట ప్రసాద్, దాసినేని గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



కొత్తమాజేరులో

చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మాజేరు కాపు సంఘం ఆధ్వర్యంలో యువకులు, గ్రామస్తులు గరిటెలతో ప్లేట్లు కొట్టారు. చల్లపల్లి-మచిలీపట్నం ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమం చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top