‘ముద్ర’ కృష్ణమూర్తి కన్నుమూత

‘ముద్ర’ కృష్ణమూర్తి కన్నుమూత - Sakshi


1980లో ‘ముద్ర’ కమ్యూనికేషన్స్‌కు శ్రీకారం

గుంటూరు జిల్లా వినుకొండలో జననం

దేశవ్యాప్తంగా ప్రచారరంగంలో తనదైన ‘ముద్ర’


సాక్షి, హైదరాబాద్/వినుకొండ రూరల్: దేశంలోనే ప్రచారరంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘ముద్ర’ వ్యవస్థాపకుడు ఎ.జి.కృష్ణమూర్తి (73) శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. అచ్యుతుని భుజంగరావు, సీతారావమ్మ దంపతులకు 1942 ఏప్రిల్ 29న వినుకొండలో కృష్ణమూర్తి జన్మించారు. తండ్రి భుజంగరావు సొంతూరు గుంటూరు కాగా ఆరోగ్యశాఖలో విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పని చేశారు. పుట్టింది వినుకొండలోనే అయినా కృష్ణమూర్తి తెనాలి మారిసుపేట, బాపట్ల, అహ్మదాబాద్‌లలో ఎక్కువ కాలం ఉన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు.


ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవిత పయనాన్ని ప్రారంభించిన కృష్ణమూర్తి అడ్వర్టైజింగ్ రంగంలో దేశవ్యాప్త గుర్తింపు సాధించారు. 1968లో కాలికోమిల్స్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 1972లో శిల్పి అడ్వర్టయిసింగ్ ఏజెన్సీని నెలకొల్పారు. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అడ్వర్టైజింగ్ మేనేజర్‌గా చేరారు. 1982లో ‘ముద్ర’ కమ్యూనికేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. 1991లో ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌ను స్థాపించారు. తర్వాత దేశవ్యాప్తంగా ప్రచార రంగంలో తమ సేవలను విస్తరించారు.


పేద కుటుంబం కాకపోయినా, కష్టాల మద్య పెరిగామని, ధీరూభాయిని కలుసుకోవటం తన జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చినట్లు తన ఆత్మకథలో రాసుకున్నారు. కృష్ణమూర్తి, లీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు అనురాధా, సుధ, సుజాత, ఒక కుమారుడు కళ్యాణ్. దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న కృష్ణమూర్తి కాలమిస్ట్‌గా, రచయితగా కూడా ప్రసిద్ధుడు. ఆంగ్లం, తెలుగులో పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆయన పుస్తకాలు పలు భారతీయ భాషల్లో ప్రచురితమయ్యాయి. చివరగా ఆయన హైదరబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.


కృష్ణమూర్తి మృతిపై జగన్ సంతాపం

వాణిజ్య ప్రకటనల రంగంలో తనదైన ముద్ర వేసిన ‘ముద్ర’ కృష్ణమూర్తి మరణం ఆ రంగానికి తీరని నష్టమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ముద్ర ఆడ్వర్టయిజ్‌మెంట్ ఒక్కొక్క ఇటుక పేర్చుతూ సుమారు రూ.46,900 కోట్ల ప్రకటనల సామ్రాజ్యాన్ని సృష్టించారని పేర్కొన్నారు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభించి ఐదు అగ్ర సంస్థల్లో ఒకటిగా నిలిపారన్నారు. ఆయన మరణం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top