ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆందోళనలు

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆందోళనలు - Sakshi


కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు.. టీడీపీ కార్యాలయాల ముట్టడి  

జూపూడిపై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్ ఫైర్


 

సాక్షి, విజయవాడ బ్యూరో: ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేసి పెద్ద మాదిగ అన్పించుకుంటానని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు దగా చేశారని ఎమ్మార్పీఎస్ నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావును టీడీపీలోకి తీసుకోవడంతో మాదిగలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం, టీడీపీ పార్టీ కార్యాలయాల ముట్టడి, కలెక్టరేట్‌ల వద్ద ధర్నా వంటి నిరసనలు మిన్నంటాయి. వంచన చేసిన బాబుకు తగిన గుణపాఠం నేర్పేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

 

  ఏపీ, తెలంగాణ అసెంబ్లీల్లో ఎస్సీ వర్గీకరణపై తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరులో టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి చిట్టిబాబును మూడు గంటలపాటు నిర్బంధించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసేవరకు వదిలేదిలేదని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఆందోళనకారులతో ఫోన్‌ద్వారా మంత్రి రావెల కిషోర్‌బాబుతో మాట్లాడించారు.

 

  పోలీసులు వచ్చి టీడీపీ కార్యాలయం తలుపులు పగలగొట్టి ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిర్బంధం నుంచి టీడీపీ నాయకుడు చిట్టిబాబును విడిపించారు. నెల్లూరులో టీడీపీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టి, అద్దాలు పగలగొట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా,  ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో కలెక్టరేట్లను, టీడీపీ కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు టి.రత్నాకర్ మాట్లాడుతూ... జూపూడి ప్రభాకర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాలజాతిని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.

 

 వర్గీకరణపై చంద్రబాబు మోసం

 ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ

 జగన్ మద్దతుపై సంతోషం  




 సాక్షి, హైదరాబాద్: మాదిగల సహకారంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఎస్సీ వర్గీకరణలో చేస్తున్న మోసాలను ఎండగట్టడమే కాకుండా అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే చంద్రబాబు అధికారాన్ని కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆయన సోమవారం తొలుత సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు తమ సహకారం లేకపోతే తెలంగాణలో పాదయాత్రే జరిగి ఉండేది కాదన్నారు.

 

 చంద్రబాబు వైఖరికి నిరసనగా మంగళవారం తెలంగాణలోని టీడీపీ కార్యాలయాలకు తాళాలు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం ఇరు రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేస్తే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మందకృష్ణ సోమవారం అసెంబ్లీలోని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లో ఆయనను కలసి వర్గీకరణకు మద్దతు కోరారు. అనంతరం లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి  తీర్మానం పెడితే తాము మద్దతు నిస్తామని జగన్ చెప్పారన్నారు. జగన్ స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

 

 మంత్రి ప్రత్తిపాటిపై అసంతృప్తి

 మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఖరిపట్ల  మందకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో వారిద్దరూ ఎదురుపడ్డారు. ఒకవైపు ఎస్సీ వ ర్గీకరణకు అనుకూలమేనంటూ ఆ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించే మాల మహానాడు నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావును మంత్రి టీడీపీలో చేర్పించడంపై మందకృష్ణ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎవరిని పార్టీలో చే ర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే వర్గీక రణకు అనుకూలమంటూ శాసనసభలో తీర్మానం చేసేలా చూడాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top