టీడీపీ కార్యాలయంలో ఎంఆర్‌పీఎస్ ఆందోళన


కొరిటెపాడు (గుంటూరు): ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లోనే తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు, కార్యకర్తలు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. వినతిపత్రం ఇవ్వటానికి వచ్చామని చెప్పి టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, నాయకులు కాకర్ల హరికృష్ణ, సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్‌లను కార్యాలయంలోకి తీసుకెళ్లి 3 గంటల పాటు నిర్బంధించారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు, టీడీపీ కార్యకర్తలతో తోపులాటకు దిగారు.



దీంతో గందరగోళం నెలకొంది. తొలుత ఎంఆర్‌పీఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీడీపీ కార్యాలయూనికి చేరుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోపలికి వెళ్లి నేతలను నిర్బంధించి బైఠాయించారు. అన్ని తలుపులకు గడియలు పెట్టారు. దీనిపై సమాచారం అందటంతో అరండల్‌పేట, గుంటూరు రూరల్, పట్టాభిపురం సీఐలు సిబ్బందితో చేరుకున్నారు. టీడీపీ నేతలు బోనబోయిన శ్రీనివాసయాదవ్, వెన్నా సాంబశివారెడ్డి, ఇక్కుర్తి సాంబశివరావు తదితరులు కూడా వచ్చి తలుపులు తీయూలని ఎంఆర్‌పీఎస్ నేతలను బతిమలాడారు. అరుునా ప్రయోజనం లేకపోవటంతో పోలీసు లు, టీడీపీ కార్యకర్తలు తలుపులు నెట్టే ప్రయత్నం చేశారు.



లోపలవున్న ఆందోళనకారులు తలుపులకు అడ్డంగా నిలుచున్నారు. దీంతో బయటవున్న పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బయట ఉన్నవారిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. అనంతరం ఎంఆర్‌పీఎస్ నాయకులతో టీడీపీ నాయకులు చర్చలు జరిపారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని ఆందోళనకారులు భీష్మించారు. చివరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుతో ఫోన్లో మాట్లాడించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని, త్వరలో తీర్మానం చేస్తామని మంత్రి హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

 

ఆత్మాహుతికి కూడా సిద్ధం..

ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు మాదిగ మాట్లాడుతూ అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయకుంటే ఆత్మాహుతికి కూడా సిద్ధమని చెప్పారు. వర్గీకరణకు అనుకూలమని అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. మాదిగలకు పెద్ద దిక్కుగా ఉండి పెద్దమాదిగను అవుతానని చెప్పారన్నారు. చంద్రబాబు మీ కోసం వస్తున్నా పాదయాత్రను తెలంగాణలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భంలో మాదిగలు రక్షణ కవచంలా నిలిచారని గుర్తుచేశారు.



జూపూడి ప్రభాకరరావు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టనిరోజు లేదన్నారు. ఇప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ ఎన్నికల్లో  ఇచ్చిన హామీ ప్రకారం వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయకపోతే 24న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.



ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ జరగకపోతే మాదిగ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు మల్లవరపు రవిరాజా, ఎస్.శివ, కట్టా బాబు, రావెల వరప్రసాద్, మందా ప్రేమానందం, గురవయ్య, బి.డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు మాట్లాడుతూ వినతిపత్రం ఇస్తామని చెప్పి లోపలకు ప్రవేశించిన ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు తమను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top