రైల్వే జోన్‌కు శాపం


సంగడిగుంట (గుంటూరు): నవ్యాంధ్ర నేపథ్యంలో రైల్వే ప్రత్యేక జోన్ ఏర్పాటు కోసం  గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజన్‌లు పోటీలో ఉన్నాయి. గుంటూరు రైల్వే డివిజన్‌కు నల్లపాడులో 100 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఎప్పటి నుంచో రైల్వే జంక్షన్‌గా సేవలు అందిస్తూ హుబ్లీ, సికింద్రాబాద్, తెనాలి, విజయవాడ నాలుగు ప్రధాన మార్గాలకు కేంద్రంగా ఈ రైల్వే స్టేషన్ ద్వారానే పలు రైళ్లు ప్రయాణిస్తున్నాయి. హుబ్లీ ద్వారా రాయలసీమ, సికింద్రాబాద్ ద్వారా తెలంగాణ, తెనాలి, విజయవాడ మార్గాల ద్వారా కోస్తాను కలుపుతూ గుంటూరు మీదుగా రైళ్లు నడుస్తున్నాయి.



ఈ నేపథ్యంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు గుంటూరుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పలువులు మేధావులు అభిప్రాయపడుతున్నారు.కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన జిల్లాకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు కృషి చేశానని, చేస్తున్నానని చెబుతున్నా ప్రత్యేక జోన్ కోసం పట్టుపట్టకపోవడం వల్లనే గుంటూరుకు జోన్ రాకుండా పోతోందని సాక్షాత్తూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలావుంటే, విజయవాడ వ్యాగన్ వర్క్ షాప్‌నకు రాయనపాడు సమీపంలో 100 ఎకరాల భూమి, రైల్వే కాలేజీలో 5 ఎకరాలు, సత్యనారాయణపురంలో 25 ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెపుతూ, తమకే జోన్ కేంద్రం కావాలంటూ విజయవాడ నేతలు పట్టుపడుతున్నారు.

 

అదే విధంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్‌లో భాగంగా ఉన్న విశాఖపట్నంను ప్రత్యేక జోన్ కేంద్రంగా ఎంపిక చేయాలంటూ అక్కడా పోటీ పడుతున్నారు. అయితే విశాఖపట్నాన్ని వదులుకునేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్ సిద్ధంగా లేదు. విశాఖపట్నం ప్రత్యేక జోన్ కేంద్రంగా ఏర్పడితే ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్ ఆదాయం పడిపోతోంది.ఇక నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మితమవుతున్న గుంటూరుకు రైల్వే జోన్ ఇవ్వాలని ఉద్యోగులు, మేధావులు, ప్రజలు కోరుతున్నారు. అయితే కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడంతో అసలు జోన్ ఏర్పాటవుతుందా లేదా అన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది.

 

రైల్వే జోన్ ఏర్పాటైతే...

* నిత్యం గుంటూరు నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య పెరుగుతుంది. అలానే ప్లాట్‌ఫాంల సంఖ్య పెరుగుతుంది. ప్రత్యేక రైళ్లు, కొత్త లైన్లు వస్తాయి. అన్ని మార్గాల్లో హాల్ట్‌ల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంది. ఉద్యోగుల సంఖ్య పెరగడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపడతాయి.

* కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు నిధుల రూపంలో అందుతాయి. జోన్‌కు సంబంధించి రైల్వే బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉం టాయి. సర్వేలకే పరిమితమైన నడికుడి- శ్రీకాళహస్తి వంటి లైన్లకు మోక్షం కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి.

* లైన్లు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు చురుగ్గా జరుగుతాయి. అవసరమైన చోట ఆర్‌యూబీలు, ఆర్‌వోబీలు నిర్మిస్తారు.

* ఇలాంటి సౌకర్యాలు ఎన్నో వున్న రైల్వే జోన్ సాధనకు ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

* ప్రయత్న లోపం వల్లే జోన్ దూరం.

* రాజకీయ నేతలు రైల్వే ప్రయాణికుల సౌకర్యాలపై అంతగా శ్రద్ధ చూపడం లేదు, గుంటూరు-విజయవాడ 26,  గుంటూరు-తెనాలి 29  కిలోమీటర్ల దూరం డబ్లింగ్ పనులను పూర్తి చేసుకోవడానికి తంటాలు పడవలసి వస్తోంది. నల్లపాడులో ఉన్న 100 ఎకరాల రైల్వే భూమి, దొనకొండలో 120 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో రైల్వే జోన్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా కేవలం ప్రజాప్రతినిధుల ప్రయత్న లోపం వల్లే జోన్ దూరం అవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top