అనంతలో డివైడర్ రగడ!

అనంతలో డివైడర్ రగడ! - Sakshi


ధర్నాకు దిగుతానన్న ఎంపీ జేసీ

బుజ్జగించిన మంత్రి పల్లె, ఎమ్మెల్యే బీకే

సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల వ్యవహారమే కారణం


 

అనంతపురం న్యూసిటీ: సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటు టీడీపీలో చిచ్చురేపుతోంది. మొన్నీమధ్యే జరిగిన కౌన్సిల్‌మీట్‌లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలు మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సోమవారం ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ సమాచారాన్ని విలేకరులకూ చేరవేశారు. బాగున్న వాటిని ఎందుకు తొలగిస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.



అలర్ట్ అయిన పోలీసులు

నగరంలో ధర్నాకు దిగుతానన్న ఎంపీ హెచ్చరికలతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురు సీఐలతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు సప్తగిరి సర్కిల్, నగరపాలక సంస్థకు చే రుకున్నారు. రెండు గంటలపాటు పోలీసులు పడిగాపులు కాశారు. చివరకు ఎంపీ జేసీ ధర్నా చేయడం లేదని తెలియడంతో వెనుదిరిగారు.





బుజ్జగించిన నేతలు

ఇటీవల కౌన్సిల్ మీట్‌లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే జేసీ ధర్నా విషయం తెలుసుకున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి వెంటనే ఫోన్‌లో జేసీతో మాట్లాడారు. ధర్నా తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. రెండు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుందామని, అంతవరకు ఆగాలని వారు చెప్పడంతో జేసీ వెనక్కు తగ్గారు.





బాగున్న డివైడర్లను ఎలా తొలగిస్తారు..?

‘సప్తగిరి సర్కిల్‌లో డివైడర్లు బాగానే ఉన్నాయి. రెండు నెలల క్రితమే రూ. లక్షలు వెచ్చించి పెయింటింగ్ వేశారు. మరీ ఇప్పుడు అందం పేరుతో డివైడర్లు ఏర్పాటు చేయడమేంటి..? అసలే డబ్బులు లేవు. నగరంలో అనేక వీధుల్లోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.  అటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక డివైడర్లు వేయండి. ఎవరొద్దన్నారు. ఏం ప్రమాదం ముంచుకొచ్చిందని డివైడర్లు వేస్తున్నారు..?’ అని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top