నారా బాబులకు ప్రజాసమస్యలు పట్టవ్‌!

నారా బాబులకు ప్రజాసమస్యలు పట్టవ్‌!


► ప్రశ్నించిన సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రద్దు చేస్తామని బెదిరింపు

► డ్వాక్రా రుణమాఫీ అడిగిన మహిళలకు కేసుల బెదిరింపులు

► చేసిన పనులకు కేంద్ర నిధులతో శంకుస్థాపనలా

► ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, అంజద్‌బాషా ధ్వజం




కడప, అగ్రికల్చర్‌ : ‘జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. కరువుతో రైతులు కష్టాలు పడుతున్నారు. డ్వాక్రారుణాలు మాఫీకాక మహిళలు బెంబేలెత్తుతున్నారు. ఇలా అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే అటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి లోకేష్‌బాబు  చుట్టపుచూపుగా జిల్లాకు వచ్చిపోతున్నారే కానీ ఏనాడూ ప్రజాసమస్యలు పట్టించుకోలేదు’ అని ఎంపీ, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. గురువారం కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.



ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రి లోకేష్‌ కాలుపెట్టగానే మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లారని, అగ్రిగోల్డ్‌ బాధితులు మైదుకూరు, దువ్వూరుల్లో నిరసన తెలిపినా సమాధానం లేదన్నారు. రైతులు, మహిళలు డ్వాక్రా రుణ మాఫీపై నిలదీసినా మంత్రి స్పందించలేదన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా రాలేదని పత్రికల్లో రాసినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఉక్కు పరిశ్రమపై పోరాటం చేస్తున్నా నోరు మెదప లేదన్నారు. ఎవరేమి అడిగినా రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌ అనే పదం తప్ప మంత్రి నోట మరేమీ రాదన్నారు.



సీఎం ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లో వెళ్తారని, హైదరాబాద్‌లోని ప్రభుత్వ నివాస గృహానికి భారీగా ఖర్చులు చేశారని, విజయవాడలోని ఇంటి అద్దెలకు, ఇంటీరియర్‌ డెకరేషన్లకు రూ.కోట్లు ఖర్చుచేసిన వారు హామీల వద్దకు వచ్చేసరికి లోటు బడ్జె ట్‌ ఉందని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నామన్నారు.  ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేష్‌ జిల్లాకు వచ్చి ఏమి వరాలు ఇవ్వకుండా వెళ్లారని ఆరోపించా రు. ప్రజాప్రతినిధులుగా తమ ప్రాంతాల్లోని  సమస్యలను చెబుదామంటే ప్రోటోకాల్‌ పాటించలేదని దుమ్మెత్తిపోశారు. ప్రజాసమస్యలను తండ్రీకొడుకులు విస్మరించారన్నారు.



ప్రజలు ఛీకొట్టిన వారిని, తమ సూపర్, తమ క్లాస్‌–1 కాంట్రాక్టర్లు అయినా వాసు, సీఎం రమేష్, మేడా మల్లికార్జునరెడ్డిలు వంటి వారిని వెంట వేసుకొని జిల్లాలో పర్యటించారన్నారు. జిల్లాలో కేసీ కెనాల్, తెలుగుగంగ, దాని ఉప కాలువలు పూర్తికాక, నీరు రాక రైతులు అల్లాడుతుంటే దాన్ని గురించి మంత్రి లోకేష్‌ కానీ, సీఎం  కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ రాజోలి వద్ద ఆనకట్ట ఎత్తు పెంచి తెలుగుగంగను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి బ్రహ్మంసాగర్‌కు నీరు తెప్పించారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లుగా బ్రహ్మంసాగర్‌లో నీరు నింపలేకపోయారన్నారు.



వైఎస్సార్‌ మంజూరు చేసిన నాటి కస్తూర్బా పాఠశాలకు ఇప్పుడు మంత్రి లోకేష్‌ వచ్చి మైదుకూరులో శంకుస్థాపన చేశారన్నారు. కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర నిధులు ఖర్చు చేసిన పాపాన పోలేదన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు రుణమాఫీ విషయమై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక సర్పంచ్‌ నిధుల విషయమై ప్రశ్నిస్తే చెక్‌పవర్‌ రద్దుచేస్తామని బెదిరించడం లోకేష్‌కే చెల్లిందన్నారు. పోలీసు పహారాలో కర్ఫ్యూను తలపించేలా మైదుకూరులో శంకుస్థాపనలు చేశారన్నారు.  జనాభిమానం ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా.. పోలీసులు లేకుండా ప్రజల్లోకి వెళ్లగలరా అని టీడీపీ నాయకులకు ఛాలెంజ్‌ విసురుతున్నామన్నారు.



జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి మంత్రి లోకేష్‌ ను అపాయింట్‌మెంట్‌ అడిగితే సమయం లేదంటారా అని ప్రశ్నించారు. కలెక్టర్‌ను ఈ విషయమై అడిగితే అమరావతికి వెళ్లి కలవండని చెబుతారా అని ప్రశ్నించారు. ఎమ్మె ల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ కడప, కమలాపురం నియోజకవర్గాల్లో మొదలుపె ట్టి పూర్తిచేసిన పనులకే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి లోకేష్‌ చేశారన్నా రు. ఎక్కడా కూడా రాష్ట్ర నిధులతో పనులు చేపట్టలేదన్నారు. మూడేళ్లుగా సర్వరాయ సాగర్‌కు నీరు ఇస్తామని చెబుతున్నా చుక్కనీరు ఇచ్చిన పాపానపోలేదన్నారు. నీరు–చెట్టు పనులు తప్ప.. సాగునీటి సమస్య కానీ, రోడ్ల పనులు కానీ చేపట్టిన దాఖలా లు లేవన్నారు.



ఎమ్మెల్యే అంజాద్‌ బాషా మాట్లాడుతూ కడపలో వైఎస్సార్‌ కేంద్రం నుంచి నిధులు తెప్పించి శాటిలైట్‌ చూపించి నీరు వచ్చేలా చేశారన్నారు. అదేమార్గంలో తాము నగరపాలక వర్గం కలిసి పైపులైన్‌ను ఆలంఖాన్‌పల్లె వరకు తీసుకరావాలని, 14వ ఫైనాన్స్‌ నిధులు ఖర్చయ్యేలా చేశామన్నారు. వాటికి మంత్రి లోకేష్‌ చేత టీడీపీ నాయకులు శంకుస్థాపన చేయించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top