ఉద్యమాలతో గర్జిద్దాం

ఉద్యమాలతో గర్జిద్దాం - Sakshi


ప్రజా వ్యతిరేకతే ఆయుధం

 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజాకంటక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. దీనిపై రాబోయే కాలంలో జరిగే ఉద్యమాలను విజయవంతం  చే సేందుకు సమాయత్తం కావాలి.



 కమిటీలు...

 గ్రామస్థాయి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  కార్యకర్తలకు హామీ ఇచ్చారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీలు వేసి కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.



 వాసన్న ఇక మీ చెంతే...

 తొలుత ఒంగోలు సమీక్ష సమావేశంలో  బాలినేని శ్రీనివాసరెడ్డి తమకు అందుబాటులో ఉండాలని, ఆ విధంగా ఆయనను ఒప్పించాలని జగన్‌మోహ న్‌రెడ్డిపై కార్యకర్తలు ఒత్తిడి తీసుకువచ్చారు.



 బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఉంటే తమకు కొండంత అండగా ఉంటారని, తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. దీంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించుకొని నియోజకవర్గ            సమీక్ష సమావేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది  వాసన్న(బాలినేని శ్రీనివాసరెడ్డి) మీకు అందుబాటులో ఉండాలని.



 ఈ విషయమై వాసన్నకు కూడా నేను సూచించా. ఆ విషయాన్ని ఆయన చేతే మీకు చెప్పిస్తానంటూ బాలినేనిని మాట్లాడాలని సూచించారు.



 పోరాటాల్లో ముందుంటా

  దీంతో స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎన్నోమార్లు ప్రజాసమస్యలపై పోరాడానని, టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాయో గమనించానని, తప్పకుండా గతం కంటే ఎక్కువ రోజులు ఒంగోలులో ఉంటూ మీకు అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది.



 సాక్షి ప్రతినిధి, ఒంగోలు

 జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రెండు రోజులపాటు జరిగిన సమీక్షా సమావేశాలు మంగళవారం రాత్రి ముగిశాయి. మంగళవారం ఒంగోలు పార్లమెంట్‌లోని ఒంగోలు, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కపురం, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాలను సమీక్షిస్తూ ఉద్యమాలతో గర్జిద్దామన్నారు. సోమవారం రాత్రి  పార్టీ ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో బసచేసిన జగన్‌మోహనరెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోపాటు పలువురు కలిశారు.



బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు తమ అభిమాన నేతను చూసేందుకు తరలివచ్చారు. అక్కడి నుంచి బచ్చలబాలయ్య కల్యాణ మండపానికి వచ్చిన జగన్‌మోహనరెడ్డిని నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, సీజీసీ సభ్యులు యల్లశిరి గోపాలరెడ్డి కలిసి హుదూద్ బాధితుల కోసం ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మార్కాపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, విద్యాసంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డి వైఎస్సార్ ఫౌండేషన్‌కు లక్ష రూపాయల చెక్కును  అందించారు.



ఒంగోలు మండల పార్టీ కన్వీనర్ రాయపాటి అంకయ్య  డాక్టర్ వైఎస్ ఫౌండేషన్‌కు రూ.50,400 విరాళాన్ని చెక్కు రూపంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి  అందజేశారు.  పశ్చిమ ప్రకాశంలోని నియోజకవర్గాలైన మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం సమీక్షల్లో ఎక్కువ మంది వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. దీంతో స్పందించిన జగన్‌మోహనరెడ్డి వెలిగొండప్రాజెక్టు పనులపై ఒక కార్యచరణ తయారు చేయిస్తామని, పనులు చురుకుగా జరిగేందుకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకొని వస్తామని,  అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  



రాబోయే ఒంగోలు కార్పోరేషన్ ఎన్నికలతోపాటు 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు పూర్తిస్థాయిలో జిల్లా కమిటీ మొదలు గ్రామ కమిటీలు, బూత్ లెవల్ కమిటీలవరకు నిర్మాణం వేగవంతంగా జరగాలని సూచించారు.టీడీపీ కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రతి మండలానికి పార్టీ తరపున వాలంటీర్లను ఎంపిక చేయాలన్నారు.  ఆ నైతిక స్థైర్యం తమలో కల్పిస్తే చాలని , టీడీపీ అరాచకాలను పూర్తిస్థాయిలో అడ్డుకుంటామని పేర్కొన్నారు. రామాపురానికి చెందిన  మాజీ సైనికుడు మధిరె రంగారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మాజీ సైనికులు అధికంగా ఉన్నారని, తమకు సైనిక స్కూల్, ఆర్మీ క్యాంటీను, వైద్యశాల ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు.



జిల్లాలో పూర్తి వెనకబడిన పశ్చిమ ప్రాంతం అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతుందని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కోరారు. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, గుండంచర్ల, కలనూతల గ్రామాలు ముంపు గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించిందని, వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ తమకు ఎటువంటి పునరావాసం కల్పించలేదని జగన్ దృష్టికి తెచ్చారు.



 అధికార టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. హెచ్‌ఎంపాడు మండలంలో అంగన్‌వాడీలను, కుకింగ్ ఏజెన్సీలను కక్షపూరితంగా తొలగిస్తున్నారని వారు  జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జగన్ ఆయా నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడుతూ  ఈనెల 5న జరిగిన రైతులు, డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేయకపోవడంపై, అవ్వ, తాతలు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు తొలగించినందుకు చేపట్టిన ధర్నా మండల కేంద్రాల్లో చేపట్టామని, అన్ని ప్రాంతాల్లో ధర్నా విజయవంతమైందన్నారు.



అదేవిదంగా వచ్చే నెలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తొలుత ఈ సమావేశాలకు ముఖ్య కార్యకర్తలు, నేతల వరకూ మాత్రమే అనుమతించాలని భావించినా వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తల అభిమానం చూసి వారందరితో సమావేశాలను నిర్వహించారు.  సమీక్షా సమావేశాల అనంతరం అనారోగ్యంతో మరణించిన ప్రముఖ నేత పర్వతరెడ్డి ఆనంద్ మృతి చెందడంతో సంతపేటలోని ఆయన ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.



అనంతరం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. మంగళవారం రాత్రి బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. జగన్ పర్యటన జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ఈ సమీక్షా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, జంకె వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి సుబ్బారెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కెపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి,  బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జి వరికూటి అమృతపాణి, ఇతర నియోజకవర్గాల ఇంఛార్జులు బుర్రా మధుసూధన్ యాదవ్, వరికూటి అశోక్,  వెన్నా హనుమారెడ్డి, పార్టీ నేతలు  కేవీ రమణారెడ్డి, కుప్పం ప్రసాద్, వై వెంకటేశ్వరరావు, కేవీ ప్రసాద్, కఠారి శంకర్, వేమూరి సూర్యనారాయణ, మారెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 

 అభిమాన నేతకు తేగలు బహుమానం

 తాళ్లూరు: ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా తాళ్లూరు మండలం అయ్యలపాలేనికి చెందిన 9వ తరగతి విద్యార్థి గరికపాటి అనిల్‌కుమార్ పరిగెత్తుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వచ్చాడు. ఆయనకు తేగలు బహూకరించి..‘అన్నా నిన్ను సీఎంగా చూడాలన్నది నా కోరిక. మా ఇంట్లో వారిని మార్చి మన పార్టీకి ఓట్లు వేయించాను’ అంటూ ఆనందభాష్పాలతో చెప్పాడు. బాలుడిని దగ్గరకు తీసుకున్న వైఎస్ జగన్..బాగా చదవాలని దీవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top