దేవుడే నా బిడ్డను తెచ్చిచ్చాడు

దేవుడే నా బిడ్డను తెచ్చిచ్చాడు - Sakshi


తల్లి ఒడి చేరిన పురిటి బిడ్డ

నాలుగు రోజుల ఉత్కంఠకు తెర

తిరుపతిలో మాయమై పీలేరు ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యక్షం

పోలీసుల గాలింపు, పత్రికల కథనాలతో బిడ్డను వదిలేసిపోతున్నట్టు లేఖ

సంతోషంతో ఉబ్బితబ్బిబైన తల్లిదండ్రులు


 

తిరుపతి కార్పొరేషన్: పురిటి బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి మొర దేవుళ్లు ఆలకించారు. తల్లికి కడుపు సోకాన్ని మిగిల్చిన గుర్తుతెలియని మహిళ నాటకీయంగా ఆ బిడ్డను శనివారం పీలేరులో వదిలిపెట్టింది. దీంతో నాలుగు రోజుల ఉత్కంఠతకు తెరపడింది.

 చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన మునిరాజ భార్య సోనియా (20)కు ఈనెల 20న తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో మొదటి కాన్పుకు అడ్మిట్ అయింది. అదే రోజు మధ్యాహ్నం 1.45 గంటలకు పాపకు జన్మనిచ్చింది. అనంతరం పురిటి బిడ్డను, తల్లిని మొదటి అంతస్తులోని వార్డుకు తరలించారు. సరిగ్గా 4.50 గంటలకు నర్సు వేషంలో వచ్చిన ఓ యువతి టీకా వేయించి తీసుకొస్తానని బిడ్డను తీసుకుని అక్కడి నుంచి మాయమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఆస్పత్రి, పరిసర ప్రాంతాల్లో బిడ్డ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో సూపరింటెండెంట్ భవానీ, ఆర్‌ఎంవో యశోదాబాయి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఐద్వా నాయకులు లక్ష్మీ, సాయిలక్ష్మీ, మాజీ కౌన్సిలర్ నవీన్‌కుమార్ రెడ్డి బాధితులకు మద్దతు పలికారు. ఆసుపత్రి ముందు రెండు రోజుల పాటు ఆందోళనలకు దిగారు.



సంఘ మిత్రలే కీలకం



పసిబిడ్డ మాయమైన కేసును తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సీరియస్‌గా తీసుకున్నారు. డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి సారథ్యంలో మూడు  ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేశారు. ఒక బృందం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించింది. రెండో టీమ్ గుంటూరులో ఉన్న చిన్న పిల్లలను ఎత్తుకుని వెళ్లే గ్యాంగ్‌పై దృష్టి సారించింది. మూడో టీమ్‌లో సంఘ మిత్రల సహకారం తీసుకోవడం కేసులో కీలకంగా మారింది. గ్రామాల్లో ఏ చిన్న అలికిడి ఉన్నా క్షణాల్లో సమాచారం ఇచ్చే సంఘమిత్రల ద్వారా అన్ని గ్రామాల్లో వేగవంతంగా విచారణ చేపట్టారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈనేపథ్యంలో పురిటి బిడ్డను తీసుకెళ్లిన వారు పోలీసులు, పత్రికల్లో వస్తున్న కథనాలతో భయపడి ఆ పసిబిడ్డను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలిపెట్టి పోతున్నట్టు లేఖ రాసి వెళ్లిపోయారు.  శనివారం రాత్రి 9.20 గంటలకు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి బిడ్డను తల్లికి  అప్పగించారు. ఒక్కసారిగా ఆమె బిడ్డను హత్తుకుని ‘‘నా చిట్టితల్లీ.. బంగారుకన్నా’’ అంటూ ముద్దులాడింది. అంతవరకు తనకు అండగా ఉన్న వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సంఘాల సభ్యులు కేట్ కట్ చేసి సంబరాలు చేసుకుని ఆ తల్లితో పాటు ఆనందం పంచుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top