ఓ అమ్మకథ..!

ఓ అమ్మకథ..!


*ఆత్మస్థైర్యం ముందు ఓడిన పేదరికం

*కూలి పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్న పార్వతమ్మ

* తల్లి కష్టాన్ని వమ్ము చేయకుండా ముందుకుసాగుతున్న తనయులు

 

 లావేరు: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని అదపాక గ్రామానికి చెందిన మీసాల సత్యం, పార్వతమ్మలది నిరుపేద కుటుంబం. ఉండడానికి సెంటు భూమి లేదు. ఇల్లు లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ఆలుమగలు ఇద్దరూ కష్టపడుతూ వచ్చిన కూలి డబ్బులతో తమ ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమారులు, కుమార్తె)కు ఏ లోటూ లేకుండా పెంచుకుంటూ వస్తున్నారు.


ఇంతలో ఆ కుటుంబంపై విధి కన్నెర్ర  చేసింది. పక్షవాతం రూపంలో ఇంటి యజమానిని మృత్యువు కాటేసింది. అంతే... కుటుంబం రోడ్డున పడింది. కళ్లు తెరచి చూస్తే పార్వతమ్మకు అంతా అంధకారమే కనిపించింది. ఓ వైపు చిరుప్రాయంలో ఉన్న పిల్లలు.. మరో వైపు జీవన భారం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి. ఆత్మస్థైర్యం కోల్పోతే పిల్లలు రోడ్డున పడిపోతారని భావించింది. గుండె దిటవు చేసుకుంది. రాత్రీపగలు శ్రమించి అరుునా పిల్లలను సాకాలని, వారి భవిష్యత్‌కు బాటలు వేయాలని, పేదరికం నుంచి వారిని గట్టెక్కించాలని నిర్ణయిచుకుంది.

 

గతంలో కంటే మరింత ఎక్కువగా కష్టపడడం ఆరంభించింది. వచ్చిన కూలి డబ్బులతోనే పిల్లలను బడికి పంపిస్తూ.. పుస్తకాలు కొనుగోలు చేస్తూ వారికి ఏ లోటూ రాకుండా పెంచింది. ఇంతలోనే ఉన్న పూరిల్లు కూలిపోరుుంది. దీంతో కుటుంబం మొత్తం మళ్లీ రోడ్డున పడింది. ఇంటిని తిరిగి నిలబెట్టేందుకు ఒక్కసారి పెట్టుబడి పెట్టలేని స్థితిలో నెలకు రూ.500 చెల్లించి గ్రామంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం ఆరంభించింది. తల్లి పడుతున్న కష్టాన్ని కుమారులు మీసాల లక్ష్మునాయుడు, సురేష్‌లు గుర్తించారు. చదువుతోనే బతుకులు బాగు చేసుకోవాలనుకున్నారు. క్రమశిక్షణతో గురువుల సహకారంతో చదువు బాట పట్టారు. పెద్దకుమారుడు లక్ష్మునాయుడు పదోతరగతిలో 521 మార్కులతో అదపాక హైస్కూల్‌కే ప్రథముడిగా నిలిచాడు.

 

దీంతో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉచితంగా సీటు లభించింది. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తయింది. ఉద్యోగ వేటను ఆరంభించాడు. చిన్నకుమాడు సురేష్ కూడా పదోతరగతిలో 9.2 పాయింట్లు సాధించి హైస్కూల్ టాపర్‌గా నిలిచాడు. జిల్లా రూరల్ డెవల్‌మెంట్ ఏజెన్సీ ద్వారా విశాఖపట్నంలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అప్పూసప్పూ చేసి కుమార్తెకు వివాహం చేసింది. గ్రామంలోనే ఉంటూ వచ్చిన కూలి డబ్బులను కుమారుల చదువుకు నెలనెల పంపిస్తోంది. అమ్మగా పిల్లలకు అండగా నిలుస్తూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తోంది. ఆదర్శంగా నిలుస్తోంది.

 

 పిల్లలు ప్రయోజకులైతే చాలు

 భర్త మృతిచెందినప్పుడు పరిస్థితి అంధకారంగా ఉండేది. పిల్లలను చదివించగలనోలేదో అన్న భయం వేసేది. నిద్రపట్టని రోజులు ఎన్నోగడిపాను. నేను ధైర్యం కోల్పోతే పిల్లలు అనాథలవుతారని గుండె దిటవు చేసుకున్నాను. పిల్లలు బాగా చదువుతున్నారు. పెద్దోడు చదువు పూర్తరుుంది. వారు ప్రయోజకులైతే అదే పదివేలు. నా కష్టమంతా మరచిపోతానంటూ పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకుంటా గలగలా కన్నీరు కార్చింది.  - పార్వతమ్మ, అదపాక

 

 అమ్మ ఎన్నో కష్టాలు పడింది..

 నేను ఆరేళ్ల వయసులో ఉండగా నాన్న పక్షవాతంతో చనిపోయారు. అప్పటికి మాకు తెలిసీతెలియని వయసు. ఎటువంటి ఆస్తులూ లేవు. సొంత ఇల్లు కూడా లేదు. అమ్మ మా కోసం కూలి పనులకు వెళ్లి ఎన్నో కష్టాలు పడి మా ఇద్దరు అన్నదమ్ములును చదివించింది. అమ్మకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అయినా మాకోసం నిత్యం కష్టపడుతోంది. ఎక్కడ ఉన్నా అమ్మకష్టమే గుర్తుకొస్తుంది. మంచి మార్కులతో బీటెక్ పూర్తి చేశాను. నేడోరేపో ఉద్యోగం వస్తుంది. అమ్మను కూలిపనులు మాన్పించి బాగా చూసుకుంటాను.   

   - మీసాల లక్ష్మునాయుడు, పెద్ద కుమారుడు

 

 అమ్మ రుణం తీర్చుకోలేం

  మేము ఉన్నత చదువులు చదవడానికి అమ్మే కారణం. నాన్న చనిపోయూడన్న లోటు లేకుండా పెంచింది. బాగా చదివించింది. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కూలి పనులు చేసి మమ్మలును పెంచింది. అమ్మ రుణం తీర్చలేంది. ఉద్యోగం వచ్చిన వెంటనే చక్కగా చూసుకుంటాం.    - మీసాల సురేష్, చిన్న కుమారుడు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top