సవాలక్షన్నర షరతులు!

సవాలక్షన్నర  షరతులు!


రుణమాఫీ విషయంలో సర్కార్ సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది...వీలైనంత ఎక్కువ మందికి మాఫీ ఎగ్గొట్టేందుకు... షరతుల మీద షరతులు విధిస్తోంది. రుణం పొందినప్పుడు చాలా బ్యాంకుల్లో జరిగే పద్ధతికి భిన్నంగా రూపొందించిన 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాను తాజాగా బ్యాంకులకు పంపింది. రుణమాఫీ లబ్ధిదారులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

విజయనగరం అర్బన్: రుణమాఫీకి అర్హులైన రైతులను ఎంపిక చేసేందుకు  తాజాగా రూపొందించిన 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాను ప్రభుత్వం బ్యాంకులకు పంపింది. లబ్ధిదారుల సంఖ్యను వీలైనంతగా కుదించే  యత్నంలో భాగంగా 30 అంశాల ప్రొఫార్మాలో రైతుల వివరాలను బ్యాంకర్ల ద్వారా సేకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఆధార్, రేషన్‌కార్డులతోపాటు మొబైల్ నంబర్ కూడా తప్పకుండా ఇవ్వాలన్న నిబంధన పెట్టింది.  వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రుణం మాఫీ జరిగే అవకాశ లేకుండా చేస్తోంది. దీంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. ఈ వివరాల సేకరణ విధానంపైనే కాకుండా జిల్లాలో ఎంత మందికి.... ఎంతమొత్తం మాఫీ చేయాల్సి ఉందో అధికారులు ఈ నెలాఖరులోగా నివేదిక తయారు చేయనున్నారు.

 

బంగారు రుణాలపై మెలిక...

జిల్లా వ్యాప్తంగా 3.44 లక్షల మంది రైతులు రూ.1,032 కోట్ల మేర వ్యవసాయ, బంగారు తనఖా రుణాలను తీసుకున్నట్లు తాజాగా జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. వీరిలో పంట భూములను చూపించి బంగారు వస్తువుల తనఖాపై రూ.264.4 కోట్ల రుణాలు పొందిన రైతులు 45 వేల మంది వరకు  ఉన్నారు. అయితే ఈ రుణాల మాఫీ అర్హత కోసం సేకరిస్తున్న 30 అంశాలలో ఒకటి బంగారు రుణాల రైతులకు మాఫీ వర్తింపకుండా చేసేలా ఉంది. వడ్డీ రాయితీ రుణం కోసం బంగారం వస్తువుతోపాటు సెక్యూరిటీగా చూపి న సాగు భూమి వివరాల నమోదు రైతుకు ఇబ్బందికరంగా మారింది.

 

 సాగు భూమిలో ఏ పంట వేశారో, ఆ పంటకు ఎకరాకు లభించే నిర్దేశిత రుణ పరిధి మొత్తానికి మాత్రమే మాఫీ వర్తింప చేయాలని నిబంధన పెట్టారు. సహజంగా పంటరుణాలకు మాత్రమే ఈ విధమైన నిర్ధేశిత రుణ పరిధిలో మొతాన్ని లెక్కించి ఇస్తారు. బంగారం తనఖా పెట్టిన రుణాలకు సాగు భూమి పట్టాపుస్తకాలను సెక్యూరిటీ కోసం మాత్రమే బ్యాంకర్ల తీసుకుంటారు. కొన్ని బ్యాంకులయితే పట్టాపుస్తకాలు చూపించకుండా రైతు సొంత పూచికత్తుతోనే రుణాలిస్తాయి.  ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయి తీ. తాజా నిబంధనల ప్రకారం రుణం తీసుకున్న సమయంలో రైతు ఏ పంట వేశారో బ్యాంకులో నమోదు చేయకపోతే రుణమాఫీ వర్తించే అవకాశం లేదు. ఎస్‌బీఐలో మాత్రమే ఈ విధంగా నమోదు చేస్తారు. డీసీసీబీ, గ్రామీణవికాస బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో పంట వివరాలు నమోదు చేయడం లేదు. అందువల్ల ఆయా బ్యాంకుల్లో బంగారం తనఖా పై రు ణాలు పొందిన వారికి మాఫీ వర్తించే అవకాశం లేదు.   దీంతో  బంగారు తనఖా రుణాలకు మాఫీ వర్తించే రైతు ల సంఖ్య జిల్లాలోభారీగా తగ్గిపోనుందని  తెలుస్తోంది.  

 

నెలాఖరులోగా జాబితా సిద్ధం

జిల్లాలో పంట, బంగారు రుణాలు కలిపి రూ.1,032 కోట్ల మేర రైతులు బ్యాంకర్లకు బకాయి పడినట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. చంద్రబాబు రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. తాజాగా రైతులతోపాటు అన్ని పక్షాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 174 జీఓను జారీ చేసింది. రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల చొప్పున పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది.   30 అంశాలతో ఒక ప్రొఫార్మాను రూపొందించింది. రైతుల నుంచి   వివరాలన్నింటినీ సేకరించి నెలాఖరులోగా జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగించింది. ఇదిలా ఉంటే 30 అంశాలలోని కొన్నింటి విషయాలు రెతుకు కనీసం తెలియదు. ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు లేని వారు అనేకమంది ఉన్నారు. ఏజెన్సీలో రైతులకు ఫోన్ నంబర్లు ఉండవు. నమోదు చేయకపోతే వారికి రుణాలు రద్దయ్యే అవకాశం లేదు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు.  దీంతో అన్నదాతల్లో ఆందోళన సెలకొంది.

 

అర్హత కోసం 30 అంశాలు నమోదుచేసుకోవాలి

వడ్డీరాయితీ రుణం కోసం బంగారువస్తువుల  తనఖాతో సాగుభూమిని చూపి తీసుకున్న రుణానికి మాఫీ అర్హత లభించాలంటే 30 అంశాల విషయ సేకరణలో విధిగా నమోదు కావాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వి.శివబాబు సూచించారు. సహకార, గ్రామీణ వికాస తదితర బ్యాంకుల నుంచి పంట భూముల సెక్యూరిటీతో బంగారం తనఖా రుణాలు పొందిన రైతులకు తాజాగా విధిస్తున్న  నిబంధన మేరకు  మాఫీ సాధ్యం కాదని వివరించారు. మిగిలిన వాణిజ్య బ్యాంకులలో కొన్ని బ్యాంకులు రుణ తీసుకున్నప్పుడు  తాజా నిబంధనలు పాటించలేదు.  పంటభూమి పట్టాపుస్తకాలు చూపించకుండా రైతు సొంత పూచీకత్తుపై బంగారం తనఖా రుణాలిచ్చిన బ్యాంకులు కూడా ఉన్నాయని తెలిపారు. దీంతో తాజా నిబంధనల మేరకు బంగారు రుణాల మాఫీ వర్తించని  రైతుల సంఖ్య భారీగానే ఉండవచ్చని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top