నైతిక విజయం మనదే

నైతిక విజయం మనదే - Sakshi

కడప కార్పొరేషన్:

 వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఆపార్టీ కడప, చిత్తూరు జిల్లాల పరిశీలకులు జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదని, నైతికంగా విజయం సాధించారన్నారు. కడప నగరంలోని అపూర్వ కళ్యాణమండపంలో శనివారం పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమర్‌నాథ్‌రెడ్డి మంచి వ్యక్తిత్వం ఉన్నవారని కొనియాడారు. మోసపూరిత వాగ్ధానాలతో, నక్కజిత్తులతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ వైఎస్ కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. పార్టీలో అన్నివర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుందని, పనిచేసిన వారిని గుర్తిస్తామన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఆకేపాటి అన్ని విధాలుగా అర్హులన్నారు. వైఎస్ మొదటి సంతకం చేసిన మరుసటిరోజు నుంచే సంక్షేమ ఫలాలు అందాయన్నారు. చంద్రబాబు చేసిన సంతకాలు అమలు చేసే పరిస్థితిగానీ, ఉద్దేశంగానీ ఉన్నట్టు కనిపించడంలేదన్నారు. మాట తప్పితే కనుమరుగుకాక తప్పదనే వైఎస్ జగన్ రైతురుణమాఫీ చేస్తానని చెప్పలేదన్నారు. డీసీసీబీ అధ్యక్షుడు ఇరగం రెడ్డి తిరుపాల్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆకేపాటి కృషి చేయాలన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషిచేసి జిల్లా అధ్యక్ష పదవికి పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. 

 కార్యకర్తలు  సహకరించాలి

 జిల్లా అధ్యక్షుడిగా తనకు  సహకరించినట్లే అమర్‌నాథ్‌రెడ్డికి కూడా సహకరించాలి. వైఎస్సార్ జిల్లా అంటేనే చంద్రబాబు అయిష్టత చూపుతున్నారు. ఆయన చెప్పిన హామీలన్నీ అచరణలో సాధ్యం కావు. గ్రామస్థాయి, బూత్‌లెవెల్‌లో కమిటీలు వేసుకోవాలి.. కేడర్ ఉన్నందునే టీడీపీ అధికారంలోకి రాగలిగింది., బీజేపీకి  కేడర్ లేకపోయినా ఆర్‌ఎస్‌ఎస్ సహాయంతో అధికారం పొందింది. అధికారంలోకి రావడానికి నోటికొచ్చినట్లు చంద్రబాబు హామీలిచ్చారు. 

  - కొత్తమద్ది సురేష్‌బాబు, కడప మేయర్

 పార్టీని అభివృద్ధి  చేసుకుందాం

 చిన్న మొక్కగా ఉన్న వైఎస్సార్‌సీపీ పెద్ద వృక్షం కావాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టించి పనిచేయాలి. 65 ఏళ్ల చరిత్రలో తొలిసారి జెడ్పీ పీఠం దళితునికి దక్కింది. అమర్‌నాథ్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉంది. 

  - గూడూరు రవి, జిల్లా పరిషత్  చైర్మన్ 

 చిరస్థాయిగా నిలవడం ఖాయం

 దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అమర్‌నాథ్‌రెడ్డి డీ సీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. నేడు రాష్ట్రం అంతా జిల్లా వైపు చూస్తోంది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి. అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్దం కావాలి. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలుస్తుంది. - కొరముట్ల శ్రీనువాసులు, 

  రైల్వేకోడూరు ఎమ్మెల్యే

 ఆ హామీలకు ప్రపంచ బడ్జెట్ సరిపోదు

 టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన 20 శాతం వాగ్ధానాలు కూడా నెరవేర్చడం కష్టం. చంద్రబాబు ఇచ్చే హామీలు ఎలా ఉన్నాయంటే జిల్లాకు పోర్టు కావాలని అడిగినా ఇచ్చేస్తా అనేట్టున్నాడు. ఆ హామీల అమలుకు ప్రపంచ బడ్జెట్ కూడా సరిపోదు. సీఎం మాటల గారడీతో నెట్టుకొస్తున్నారు. ఎంతసేపు ఎన్టీఆర్ పేరు వాడుకోవడమే తప్పా తన పాలనలో ఏం చేశారో, ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పడం లేదు. అందరం కలిసికట్టుగా కృషిచేసి కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. భవిష్యత్తు మనదే. - గడికోట శ్రీకాంత్‌రెడ్డి, 

  రాయచోటి ఎమ్మెల్యే 

 కార్యకర్తలకు కష్టం వస్తే 

 కాకుల్లా పోరాడుదాం

 రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే. మారిపోయిన వ్యక్తి అని ప్రజలు ఆయనకు ఓట్లు వేశారు. అన్ని వర్గాలను క లుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అధికారంలోకి రాలేదని ఎవరూ అధైర్యపడొద్దు. స్థాపించిన మూడేళ్లలోనే ఇంతశాతం ఓట్లు సాధించిన పార్టీ దేశంలోనే లేదు. పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే కాకుల్లా పోరాడుదాం. అసెంబ్లీలో అధికారపక్షం ప్రతిపక్షం గొంతునొక్కేలా ప్రవర్తించింది. 

  - ఎస్‌బీ అంజద్‌బాషా, కడ ప ఎమ్మెల్యే 

 ఉన్నదున్నట్లు చెప్పడమే 

 నష్టం కలిగించింది

 రాజకీయాలలో ఉన్నది ఉన్నట్లు చెబితే నష్టం కలుగుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ పరిస్థితి కూడా అలాగే అయింది. భ్రమ కల్గించిన చంద్రబాబును ప్రజలు నమ్మారు. చంద్రబాబు ఇప్పటికీ ఒక్క హమీ నెరవేర్చలేదు. 

  - రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, 

  {పొద్దుటూరు ఎమ్మెల్యే 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top