పర్యవేక్షణకు ‘జన్మభూమి కమిటీలు’

పర్యవేక్షణకు ‘జన్మభూమి కమిటీలు’


తుపాను సాయంపై సీఎం చంద్రబాబు ప్రకటన

రేపు సాయంత్రానికల్లా చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందిస్తాం

రేపే విశాఖ బీచ్‌లో ‘తుపానును జయిద్దాం’ ర్యాలీ

వాకతిప్ప పేలుళ్ల మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటన


 

హైదరాబాద్: తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో బాధితులకు అందించే పరిహారం పంపిణీ పర్యవేక్షణ అధికారాలను.. ‘జన్మభూమి- మా ఊరు’ సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీలకే అప్పగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. న్యాయ సమ్మతంగా బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ కమిటీలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తాయన్నారు. బాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పంటల నష్టం, ఇళ్ళు నష్టం తదితరాల అంచనాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 400 బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. నష్టం అంచనా వివరాల్ని ఎన్‌ఆర్‌ఎస్‌ఏ డేటాతో అనుసంధానం చేసి నిజమైన అర్హుల్ని గుర్తిస్తామన్నారు.



రేపటికల్లా బాధితులందరికీ సాయం...



ఈ నెల 22 సాయంత్రానికి తుపాను కారణంగా నష్టపోయిన చిట్ట చివరి బాధితుడికి సాయం అందేలా అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం చెప్పారు. బాధితులకు అందించే సాయం పరిమాణాన్ని రెండు విభాగాలుగా విభజించామని.. తీవ్రంగా నష్టపోతే ఒక కేటగిరీ కింద, మిగిలిన నష్టానికి మరో కేటగిరీ కింద సాయం అందిస్తామని తెలిపారు. తుపాను బాధిత ప్రజలకు ఏ ఏ సరుకులు ఇస్తున్నామో.. ఫ్లెక్సీలు రూపొందించి చౌక ధరల దుకాణాల ఎదుట ఉంచుతున్నామని, అంతేకాకుండా ఆటోల, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ఆదేశాలిచ్చామన్నారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు అంటే 22వ తేదీ (బుధవారం) విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో కొవ్వొత్తులు, కాగడాలతో ‘తుపానును జయిద్దాం’ పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు.



 రాష్ట్రంలో ఇప్పటివరకు 78 సార్లు తుపాన్లు వచ్చాయని.. వాటిని ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు.



 రుణవిముక్తికి ఇక బ్యాంకులదే ఆలస్యం...



 రైతుల్ని రుణ విముక్తి చేసేందుకు విజయవాడలో మంగళవారం రైతు సాధికారత సంస్థను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

 డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లుడ్వాక్రా మహిళల రుణాల మాఫీకి త్వరలో ఓ సాధికారిత సంస్థను ఏర్పాటు చేస్తామని బాబు చెప్పారు. ఇసుక పాలసీపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని, డ్వాక్రా సంఘాల ద్వారా ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. యూనిట్ ఇసుకను రూ. వెయ్యికే అందిస్తామన్నారు. ఎర్రచందనం, బెరైటీస్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.



 పేలుడు ఘటనపై సమగ్ర విచారణ



 తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో బాణా సంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో 11 మంది మృతి చెందటం ఎంతో బాధాకరమని, దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆదేశించానని సీఎం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహారం ప్రకటించారు.



 సాధికారిక సంస్థకు 5 వేల కోట్లు విడుదల



 రైతు రుణ విముక్తి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ(ఆర్‌ఎస్‌ఎస్)కు రూ. 5 వేల కోట్లను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 కార్పొరేట్ సంస్థలకు తుపాను ప్రాంతాల దత్తత...

 

తుపాను బాధిత ప్రజల్ని ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయని, అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకు ఈ విపత్తు సాయం రానందున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని, కార్పొరేట్ సంస్థలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సీఎం చెప్పారు. తుపాను ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు దత్తతకు ఇస్తామని, వారిచ్చే డబ్బుకు, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అన్ని వసతులతో, కాలనీలు నిర్మిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్‌షిప్పులు, గ్రామాల్లో ఆదర్శ కాలనీలు నిర్మిస్తామన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top