రాజధాని గ్రామాల్లో మనీ.. మనీ

రాజధాని గ్రామాల్లో మనీ.. మనీ - Sakshi


* భూములు అమ్మిన రైతుల ఇళ్లకే బ్యాంకులు.. డిపాజిట్ల కోసం పోటాపోటీ

* అధిక వడ్డీలు, పథకాల పేరిట ఆఫర్లు

* వారంలోగా 3 గ్రామాల్లో ఆంధ్రాబ్యాంకు కొత్త శాఖలు

* నేడో రేపో తాడికొండలో ఎస్‌బీఐ శాఖ ప్రారంభం

* రూ. 20 కోట్ల కొత్త డిపాజిట్లు సేకరించిన బ్యాంకులు



సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని జోన్‌లో జోరందుకున్న భూ విక్రయాల నేపథ్యంలో సొమ్ములున్న రైతులను ఆకట్టుకునేందుకు బ్యాంకులు  పోటీ పడుతున్నాయి. డిపాజిట్ల వేట ప్రారంభించి నూతన శాఖల ఏర్పాటుకు సమాయత్తమయ్యాయి. ఈ నెలాఖరులోగా తుళ్లూరు మండలంలో వివిధ బ్యాంకులు కొత్తగా 6 శాఖలను ప్రారంభిస్తున్నాయి. భూ క్రయవిక్రయాలు బాగా జరుగుతున్న గ్రామాలను ఎంపిక చేసుకుని డిపాజిట్లపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గత పది రోజుల్లో ఇక్కడ పలు బ్యాంకులు రూ.20 కోట్లకు పైగా డిపాజిట్లను చేయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.



రైతుల వద్దకు బ్యాంకు అధికారులు

రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ఇప్పటి వరకూ 1,600 ఎకరాలకు పైగా అమ్ముడుపోయాయని ‘రియల్’ వ్యాపార వర్గాల అంచనా. ఇవన్నీ రిజిస్ట్రేషన్ పూర్తయినవి మాత్రమే. ఇవి కాకుండా మరో 1,000 ఎకరాలకు పైగా క్రయవిక్రయాల ఒప్పందాల్లో ఉన్నాయి. ఎకరా ధర రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకూ పలికింది. ఈ లెక్కన సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూముల వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. భూములు అమ్మిన రైతులు తమ దగ్గర కోట్ల రూపాయల నగదును ఉంచుకునేందుకు భయపడుతున్నారు.



కొందరు రైతులు కొత్త ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసే పనిలో ఉండగా మరికొందరు విజయవాడ, గుంటూరు, మంగళగిరి లాంటి  చోట్ల డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వద్ద డబ్బును డిపాజిట్లుగా మలుచుకునేందుకు  బ్యాంకులు రంగ ప్రవేశం చేశాయి. జిల్లా లీడ్‌బ్యాంక్ ఆంధ్రాబ్యాంకు, భారతీయ స్టేట్‌బ్యాంకు, ఎస్‌బీహెచ్, చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకుల జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక బిజినెస్ బృందాలను గ్రామాలకు పంపుతున్నాయి. ఏబీ అమెరాల్డ్ డిపాజిట్ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆంధ్రాబ్యాంకు జీవన్ అభయ, డబుల్, ట్రిపుల్ ప్లస్ బీమా పథకాలను వివరిస్తూ డిపాజిట్లను సేకరిస్తోంది.



చీఫ్ మేనేజర్ మదన్‌మోహన్, సీనియర్ మేనేజర్  శ్రీనివాస్‌లు బిజినెస్ బృందాలను సమన్వయపర్చుకుంటున్నారు. భారతీయ స్టేట్‌బ్యాంక్ గుంటూరు ఆర్‌ఎం శ్రీనివాస్‌ప్రసాద్, హైదరాబాద్ నుంచి వచ్చిన బిజినెస్ మేనేజర్ ఆదిరాజు రెండ్రోజుల పాటు తుళ్లూరు, మందడం గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ బ్రహ్మానందరెడ్డి ఆదేశాలపై బ్యాంకు ఉద్యోగులు మూడు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో డిపాజిట్లు సేకరిస్తున్నారు.     



6 కొత్త శాఖలు ప్రారంభం..

ఎస్‌బీఐ, ఆంధ్రా, చైతన్యగోదావరి బ్యాంకులు రాజధాని జోన్‌లో ఎంపిక చేసుకున్న గ్రామాల్లో అతి త్వరలో 6 కొత్త శాఖలను ప్రారంభించనున్నాయి. తాడికొండలో భారతీయ స్టేట్‌బ్యాంకు 29వతేదీ లేదా 30న కొత్త బ్రాంచిని ప్రారంభించనుందని ఏజీఎం శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఆంధ్రాబ్యాంకు అధికారులు తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి గ్రామాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించినట్లు గుంటూరు సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు దగ్గరగా ఉండే చైతన్యగోదావరి బ్యాంకు తుళ్లూరు, అనంతవరం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు గ్రామాల్లో  శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.



ఏఎన్‌యూలో ఎస్‌ఎల్‌బీసీ...

నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించే ఆంధ్రా బ్యాంకు భవనంలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్ కార్యాలయం ఇక్కడికే రానుంది. యూనివర్సిటీ అధికారులు బ్యాంకు భవన నిర్మాణం కోసం 1,000 గజాల స్థలాన్ని  కేటాయించగా రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. జనవరిలో టెండర్లు ఖరారై పనులు మొదలయ్యే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top