వారికి భూమ్మీద నూకలుండవు

వారికి భూమ్మీద నూకలుండవు


► ఇసుకదొంగలకు పుట్టగతులుండవ్‌

► ఊరి కోసం ప్రాణత్యాగం చేసినవారు ఎన్నటికీ అమరులే

► ఏర్పేడు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు మోహన్‌బాబు పరామర్శ


శ్రీకాళహస్తిః ‘‘ఏ పాపం తెలియని 15మంది చావుకు.. 25మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన వారికి భూమ్మీద నూకలు ఉండవు.  ఇసుక దొంగలకు ఆ దేవుడే సరైన శిక్ష విధిస్తాడు’’ అని సినీనటుడు  మంచు మోహన్‌బాబు అన్నారు. సోమవారం ఆయన చిత్తూరు జిల్లా మునగలపాళెం, ముసిలిపేడు, రావిళ్లవారి కండ్రిగ గ్రామాలకు వెళ్లి ఏర్పేడు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు.


ముందుగా మునగలపాళెంలోని పేరం జయచంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు  మాట్లాడుతూ జయచంద్ర మృతితో ఆయన పిల్లలు మోహిత్, యజ్ఞ అనాథలయ్యారన్నారు. వారి తల్లి రేణుక పొట్టకూటి కోసం రెండు నెలల క్రితం సౌదీకి వెళ్లారని.. ఆమెను అక్కడి సేట్లు ఆరు నెలలు తర్వాత పంపుతామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం నంద్యాల భాస్కరయ్య కుటుంబాన్ని, సుమతి కుటుంబాన్ని పరామర్శించారు.


సుమతి కుమార్తె మౌనిక గత ఏడాది పదోతరగతిలో పదిపాయింట్లు సాధించిందనీ, అయితే ఆర్థిక ఇబ్బందులతో చదువుకోవడం భారంగా ఉందని తెలిపారు. దీంతో మోహన్‌బాబు తమ విద్యాసంస్థలో ఆ బాలికకు ఉన్నత చదువులు చదివిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత నాగేశ్వరరావు కుటుంబాన్ని, ప్రమాదంలో మృతి చెందిన తండ్రికొడుకు మునికృష్ణమనాయుడు, కోదండపాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తంచేశారు. 


అనంతరం ఏ.గంగాధర్, ప్రభావతమ్మ, సరస్వతమ్మ, వసంతమ్మ, మునెయ్య కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి ముసిలిపేడుకు వెళ్లి మఠం బాబు, మావిళ్ల హరి కుటుంబాలను, రావిళ్లవారి కండ్రిగలోని రాజేంద్ర కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


ఊరి కోసం ప్రాణాలు కోల్పోయిన వారు అమరులే

‘‘దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా.. వీర జవాన్లుగా పిలుస్తారనీ, అదేవిధంగా ఊరు కోసం ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అమరులే’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు. ఇసుక దందాపై  నేతలు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోయినా.. పోరాటం కొనసాగించి మృతి చెందినవారు గొప్పయోధులేనని అన్నారు. పదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో స్వర్ణముఖినది ప్రవహిస్తే అనేక గ్రామాలకు రాకపోకలు ఉండేవికాదని తెలిపారు.


అప్పుడు తాను రాజ్యసభ సభ్యునిగా ఉండడంతో రూ.70లక్షలు ఖర్చు చేసి స్వర్ణముఖినదిపై వంతెన ఏర్పాటు చేశామని చెప్పారు. ఇసుక దందా వల్ల ఆ వంతెన కూడా శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. ఈ గ్రామాన్ని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పారు.  ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న అందరిపైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయనతోపాటు శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్‌ కోలా ఆనంద్, మోహన్‌నాయుడు, బాబునాయుడు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top