మోదీ పాలనలో పేదల భక్షణ

మోదీ పాలనలో పేదల భక్షణ - Sakshi


- కార్మిక హక్కులు కాలరాస్తున్న మోదీ సర్కార్‌పై పోరాటానికి సిద్ధమవండి

- అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న

చీరాలటౌన్ :
మోదీ పాలన పేదల భక్షణ..బడా బాబులకు రక్షణగా నిలుస్తోందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం..నల్లదనాన్ని వెలికితీసి పేదలకు అందిస్తానని చెప్పి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోదీ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సి.పెద్దన్న విమర్శించారు. చీరాలలోని షిర్డీ సాయిబాబా కల్యాణ మండపంలో ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కార్మిక సదస్సు ఆదివారం నిర్వహించారు. బీజేపీ  అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలో ఊడిగం చేసే విధంగా కార్మిక హక్కులపై దాడి చేయడం ప్రారంభించిందన్నారు.



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు, కార్మికుల సమస్యలను వదిలేసి విదేశీ పర్యటనలకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రవేటీకరించే చర్యలకు పూనుకుంటున్నాయని చెప్పారు. దేశ సంపదలను కొల్లగొడుతూ విదేశీయులకు రెడ్ కార్పెట్‌లను పర్చడంలో మోదీని మించిన వారు లేరన్నారు.  సెప్టెంబర్ 2న చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేలా జీవోలను ఇవ్వడం దారుణమన్నారు.



కార్మికులకు ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వీటన్నింటిని తిప్పికొట్టేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. కార్మికులకు కనీసవేతనం రూ.15 వేలు ఇవ్వాలని, కార్మికులకు సామాజిక భద్రత కల్పించి కార్మిక చట్టాల సవరణలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు వార్తికోట సుబ్బారావు, డివిఎన్ స్వామి, ఎస్. లలితకుమారి, కత్తి పేరయ్య, ఎన్. కుటుంబరావు, ఎ.సతీష్, అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top