‘మోడల్’ హాస్టళ్లు రెడీ!


 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మోడల్ స్కూళ్లలో చదువుతున్న బాలికల కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఒడిదుడుకులతో సాగిన హాస్టళ్ల నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే పూర్తవుతాయి. అన్నీ అనుకున్నట్లు జరిగే ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయానికి హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మొ త్తం 33 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్ల సదుపాయం కల్పించాల్సి ఉంది. అయితే నిధుల లేమితో సమస్య మొదటికొచ్చింది. అబ్బాయిల హాస్టళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా కేవలం అమ్మాయిల వాటికి మాత్రమే కేటాయించారు. ఒక్కో దానికి రూ. 1.28 కోట్లు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో రూ. 5 లక్షల ఫర్నిచర్స్ కోసం కేటాయించాలి. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి.

 

   వెంటనే పనులు మొదలు పెట్టిన ఏడాదిపాటు పనులు సాగుతూ వచ్చాయి. మే నెలలోనే పనులు పూర్తికావాల్సి ఉండగా దాదాపు రెండు నెలలు ఆలస్యంగానైనా పూర్తయాయి. జిల్లాలో 31 పాఠశాలల్లో హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డోన్, కొలిమిగుండ్ల పాఠశాలల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని కూడా వారం, పది రోజుల్లో పూర్తి చేస్తామని సర్వశిక్షా అభియాన్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆయా హాస్టళ్లలో మంచినీటి సమస్య, కరెంట్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

 

 సిబ్బంది నియామకం వేగవంతం:

 సీనియర్ అధ్యాపకులకు వార్డెన్లుగా ఇన్‌చార్జి ఇచ్చారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక కమాటీలు, కుక్‌లు, వాచ్‌మన్‌లు, ఇతర అధికారుల పోస్టులను భర్తీ చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ మోహన్ అనుమతి ఇచ్చారు. వారం రోజుల్లోగా ఔట్‌సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా నియమకాలు చేపట్టేందుకు చర్యలు వేగమంతమయ్యాయి.

 

 బాలికల కష్టాలు తొలగినట్లే

 ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో చదివే బాలికల కష్టాలు వర్ణనాతీతం. పాఠశాలకు వెళ్లాలంటే నరకం కనిపించేది. మండల కేంద్రాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో పాఠశాలలు ఉండడంతో వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రోడ్డు సదుపాయం లేని వాటికి ఆటోలు కూడా వెళ్లని పరిస్థితి. ఈ నేపథ్యంలో అమ్మాయిలు కాలినడకన పాఠశాలలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వర్షాకాలంలో వానకు తడుస్తూ పోవాల్సిన పరిస్థితి ఉండేది. హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తవడంతో అమ్మాయిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీరనున్నాయని, హాస్టల్‌లో ఉండి బాగా చదువుకోవచ్చని పేర్కొంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top