ఏపీలో పాలనపై బీజేపీ ఎమ్మెల్సీ ధ్వజం

ఏపీలో పాలనపై బీజేపీ ఎమ్మెల్సీ ధ్వజం - Sakshi


కడప‌: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పరిపాలన అదుపు తప్పిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. బుధవారం వైఎస్సార్‌ జిల్లా కడపలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆరోపించారు. నదులు, వాగులు, వంకలు అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. అలా తరలించిన ఇసుకను బెంగళూరు తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారని తెలిపారు.



సిమెంట్, స్టీల్‌ ధరలు అమాంతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సిమెంట్‌ ధరలను పెంచి విక్రయాలు జరుపుతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టించడం వల్లనే ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయని వ్యాఖ్యానించారు. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మార్కెట్‌లో కిలో బియ్యాన్ని ప్రజలు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అలాంటిది పొలంలో పండించిన వరికి ఎందుకు గిట్టుబాటు లభించడం లేదని ప్రశ్నించారు.



రాష్ట్రంలో పరిపాలన అదుపుతప్పడంతోనే ఇలా జరుగుతోందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడ బీజేపీ బలపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చేనెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top