కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు - Sakshi


ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో శోకసంద్రమైన తిరుపతి నగరం

పార్థివదేహంతో నగరంలో ఊరేగింపు

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు




తిరుపతి కార్పొరేషన్/ మంగళం: ప్రజల మనిషి, తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ భౌతికకాయానికి నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ పార్టీల నాయకులు కన్నీటితో వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం విదితమే. తిరుపతిలోని స్వగృహానికి చేరుకున్న ఎమ్మెల్యే పార్థివదే హాన్ని రాజకీయాలకు అతీతంగా జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సంద ర్శించి నివాళులర్పించారు. మృదు స్వభావి, పిలిస్తే పలికే వ్యక్తిగా పేద ప్రజల నుంచి గుర్తింపు పొందిన వెంకటరమణ మృతిని నగర ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. వేలాదిగా ఆయన నివాసానికి చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఉదయమే వెంకటరమణ నివాసానికి చేరుకున్నారు. శోకతప్త హృదయంతో ఎమ్మెల్యే పార్థివదేహం వద్దనే గడిపిన భూమన  వారి కుటుంబ సభ్యులను ఓదార్చా రు. మధ్యాహ్నం 12.30 గంటలకు అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పార్థివదేహం ఉన్న పాడెను భూమన కరుణాకరరెడ్డి కొంతదూరం మోశారు. అంతకు ముందు ఎమ్మెల్యే భౌతికకాయాన్ని ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, శంకర్, అమరనాథ్‌రెడ్డి, తలారి ఆదిత్య, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీలు శ్రీనివాసులు రెడ్డి, రామచంద్రయ్య, మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.



అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు...



ఎమ్మెల్యే వెంకటరమణకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఆయన భౌతికకాయం వద్ద అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ పాటించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే వెంకటరమణ భౌతికకాయానికి సంప్రదాయబద్ధంగా మధ్యాహ్నం 2.20 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు కొడుకులు లేకపోవడంతో చిన్న అల్లుడు సంజయ్ తలకొరివి పెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనివాని శ్రీనివాసులు, నాయకులు శ్రీధర్‌వర్మ, దంపూరి భాస్కర్ యాదవ్, నర్శింహ యాదవ్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ సుకుమార్, డాక్టర్ ఆశాలత, టౌన్‌బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళి, లడ్డుభాస్కర్, కంకణాల రజనీకాంత్, పార్టీ కార్యకర్తలు, నగర ప్రజలు అశేష సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు.

 

అశేష జనవాహిని నడుమ ఊరేగింపు...

 


ఎమ్మెల్యే వెంకటరమణ భౌతికకాయాన్ని స్విమ్స్ మార్గంలోని ఆయన నివాసం నుంచి కపిలతీర్థం నంది సర్కిల్ సమీపంలోని వారి సొంత స్థలానికి పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అశేష జనవాహిని నడుమ తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రామకృష్ణ డీలక్స్ సర్కిల్‌లోని ఆయన నివాసం నుంచి పాత మెటర్నిటీ ఆసుపత్రి, భవానీ నగర్ సర్కిల్ మీదుగా టీటీడీ పరిపాలనా భవనం, అన్నారావు సర్కిల్, అక్కడి నుంచి నంది సర్కిల్ వద్ద ఉన్న ఎమ్మెల్యే సొంత స్థలం వరకు అంతిమయాత్ర సాగింది. ఎమ్మెల్యే వెంకటరమణ ను కడసారి చూసేందుకు నగర ప్రజలు పెద్ద సం ఖ్యలో బారులు తీరారు. పలువురు మహిళలు కన్నీటితో వీడ్కోలు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top