వెంకటరమణ ప్రతిపాదనకు..గ్రీన్ సిగ్నల్

వెంకటరమణ ప్రతిపాదనకు..గ్రీన్ సిగ్నల్ - Sakshi


* కొనసాగింపునకు సీఎం ఆమోదం

* తుడా పాలకమండలినియామకానికి బ్రేక్

* అధికారులను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ


 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణను తుడా(తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. కానీ.. తుడా పాలక మండలిని నియమించేందుకు నిరాకరించారు. తుడా పాలక మండలిలో అధికారులను సభ్యులుగా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం:190) జారీచేశారు. వివరాలిలా..

 

ఎం.వెంకటరమణను తుడా చైర్మన్‌గా నియమిస్తూ ఫిబ్రవరి 11, 2014న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సీఎంగా కిరణ్ రాజీనామా చేయడానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న తుడా చైర్మన్ ఎం.వెంకటరమణకు తిరుపతి శాసనసభ అభ్యర్థిత్వం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ఎర వేశారు. టీడీపీలో చేరేందుకు అంగీకరించిన వెంకటరమణ.. తాను గెలిచినా ఓడినా తుడా చైర్మన్‌గా కొనసాగించాలనే షరతు పెట్టారు. ఆ షరతుకు అంగీకరించిన చంద్రబాబు..ఆయనకు టీడీపీ తీర్థం ఇచ్చారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వెంకటరమణ విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో నియమించిన దేవాలయ, మార్కెట్‌యార్డు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పాలకమండళ్లను రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు తన పదవీ కాలం పూర్తయ్యే(ఫిబ్రవరి 10, 2016) వరకూ తనను తుడా చైర్మన్‌గా కొనసాగించాలని చంద్రబాబుపై వెంకటరమణ ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం చంద్రబాబు.. అన్ని పాలక మండళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసినా తుడాను తప్పించారు. కానీ.. ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తుడా పాలక మండలి నియామకంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేలా అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. తుడా అధికారులు పంపిన ప్రతిపాదనలపై మంగళవారం ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.

 

పదవీకాలం పూర్తయ్యే వరకూ వెంకటరమణనే తుడా చైర్మన్‌గా కొనసాగిస్తున్నట్లు స్పష్టీకరించింది. కానీ.. పాలక మండలిలో అనధికారుల(టీడీపీ నేతల)ను నియమించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయ్యే దాకా తుడా పాలక మండలిని నియమించకూడదని సీఎం నిర్ణయించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పాలక మండలి నియామకం జరిగే వరకూ తుడాకు మెంబర్ కన్వీనర్‌గా తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, సభ్యులుగా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యదర్శి లేదా ఆయన ప్రతినిధి, ప్రభుత్వ ఆర్థిక, ప్రణాళికశాఖ కార్యదర్శి లేదా ఆయన ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలక మండలి నియామకం చేసే వరకూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టీకరించడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top