బాబు తొలి సంతకాలు ‘హుద్‌హుద్’లో కలిశాయి


* ఎమ్మెల్యే కలమట వెంకటరమణ

* రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలి


పాతపట్నం : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాలు హుద్‌హుద్ తుపానులో కొట్టుకుపోయాయని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు రుణమాఫీలు వట్టి బూటకమని అందరికీ తెలుసన్నారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని వారం రోజులు హడావుడి చేసి ఆ తరువాత అనుబంధ దుకాణాల పేరుతో మరిన్ని మద్యం దుకాణాలు తెరిచిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు.



పింఛనే జీవనాధారంగా బతుకుతున్న వేలాది మంది పింఛన్లు రద్దు చేసిన బాబుకు వారి ఉసురు తగలక తప్పదన్నారు. వివిధ కారణాలతో పాతపట్నం నియోజక వర్గంలో సుమారు 3వేలమంది పింఛన్లు రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజునే మోసాలకు ఎంచుకున్న బాబు నిరంతర విద్యుత్, రూ.2లకు 20లీటర్లు మినరల్ వాటరు ఏమైందన్నారు.



ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లకు కనిపిస్తున్నవి సింగపూర్ లాంటి రాజధాని, ఇసుక అమ్మకాలేనని ఆరోపించారు. ఇసుక విధానంతో పేదవాడు గూడుకట్టుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు గంగు వాసుదేవరావు, ఎన్.లక్ష్మణరావు, ఆర్.రమణ, ఎస్.ప్రభాకరరావు, ఇ.సింహాచలం, ఎ.కర్రెన్న, ఇ.వసంతరావు, బి.అప్పారావు, కె.ఎరకయ్య, ఎన్.సూర్యరావు, జి.లుట్టిబాబు తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top