లోకేష్‌ లోపాలను ఎత్తిచూపితే కేసులా?

లోకేష్‌ లోపాలను ఎత్తిచూపితే కేసులా? - Sakshi


► విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత సోమిరెడ్డికి లేదు

► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి  


వెంకటాచలం(సర్వేపల్లి) : రాష్ట్ర మంత్రి లోకేష్‌ లోపాలను ఎత్తిచూపితే టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంపై దాడులు చేయడం ఏంటని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. వెంకటాచలంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యంలేక టీడీపీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు.


సోషల్‌ మీడియా కార్యాలయంపై దాడులు చేసి, అక్కడ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అసెంబ్లీ కార్యదర్శిని, పోలీసులను ప్రశ్నిస్తే తప్పేముందన్నారు. చంద్రబాబు వద్ద మెప్పు పొందేందుకు తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం మంత్రి సోమిరెడ్డికి తగదన్నారు. విజయసాయిరెడ్డిని విమర్శంచే స్థాయి, అర్హత సోమిరెడ్డికి లేదన్నారు. చంద్రమోహన్‌రెడ్డి అంటే ఎవరూ గుర్తుపట్టడంలేదని, చందాలరెడ్డి అంటూ వెంటనే అందరూ గుర్తుపట్టే వి«ధంగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు.


నకిలీ ఎరువుల కుంభకోణం, క్రికెట్‌ కిట్లు అమ్ముకోవడం, గ్రావెల్‌ అక్రమ రవాణా ఇలా అన్నింటిలో సోమిరెడ్డి పాత్ర  ఉండటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి ఇతరులను విమర్శంచడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వెంకటాచలం ఎంపీపీ తలపల అరుణ, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి  కోదండరామిరెడ్డి, మండల కన్వీనర్‌ కరియావుల చెంచుకృష్ణయ్య పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top