గాడి తప్పిన పాలన..!

గాడి తప్పిన పాలన..! - Sakshi


పంచాయతీ ఎన్నికలు జరిగి నాలుగేళ్లు గడిచాయి. మరో ఏడాది మిగిలి ఉంది. వెనుకకు తిరిగి చూస్తే చెప్పుకోదగ్గ పనులు లేవు. ప్రజలకు చేసిన మేలు కనిపించడం లేదు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం లేదు. అధికారాల బదలాయింపు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులపైనా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తోంది. ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు విధిస్తోంది.



బకాయిల చెల్లింపునకే మొగ్గుచూపుతోంది. జన్మభూమి కమిటీల పెత్తనంతో పంచాయతీ పాలకవర్గాలకు విలువ లేకుండా పోయింది. ఎదురు తిరిగితే సర్పంచ్‌ చెక్‌పవర్‌పై వేటు పడుతోంది.దీంతో అభివృద్ధి ఆలోచనలను చంపుకుని కాలం గడిపేస్తున్నాం.. టీడీపీ ప్రభుత్వ కాలంలో ఇంతకంటే ఏమీ చేయలేమంటూ సర్పంచ్‌లు చేతులెత్తేస్తున్నారు. ప్రశ్నించిన ప్రజలకు ఇదే సమాధానం చెప్పుకొస్తూ మరో ఏడాది కాలం గడిపేందుకు సిద్ధమవుతున్నారు.



విజయనగరం కంటోన్మెంట్‌:

‘మేం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలకు అధికారాలు బదాలయిస్తాం. పార్లమెంటు పెద్దల సాక్షిగా జరిగిన 73వ రాజ్యాంగ సవరణను అమలు చేసి 18 అధికారాలు, నిధులు, విధులు, సిబ్బందిని కేటాయిస్తాం. గ్రామాల నుంచి సమస్యలపై ఎవరూ మండలాలకు కూడా రానవసరం లేదు’ ఎన్నికల ముందు సభల్లో చంద్రబాబు హామీ. నాలుగేళ్లుగా ఈ హామీ ఆచరణకు నోచుకోలేదు. పంచాయతీ పాలకులకు అధికారాలు బదలాయింపు జరగలేదు.



‘స్థానిక సంస్థలకు అధికారాలిచ్చే రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తోంది. ఆయా ప్రభుత్వాలు మనుగడ కోల్పోతున్నాయి. దీనిపై పరిశీలన చేస్తున్నాం’. ఇది పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.



టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్‌లకు విలువలేకుండా పోయింది. చట్టబద్ధతలేని జన్మభూమి కమిటీల పెత్తనంతో ప్రజలకు సంక్షేమం ఎండమావిగా మారిందంటూ పంచాయతీ పాలకులు గగ్గోలు పెడుతున్నారు. పాలకులకు అధికారాలు లేకుండా చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



 పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న పూజ్య బాపూజీ మాటలకు సీఎం చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని విమర్శిస్తున్నారు. పంచాయతీలకు రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చే ఆదాయమే తప్ప మరే ఇతర ఆదాయం లేకుండా పోయిందని, అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 73వ రాజ్యాంగ సవరణతో సంక్రమించిన 18 శాఖల అధికారా లు స్థానిక సంస్థలకు బదలాయిస్తానన్న సీఎం చంద్రబాబునాయుడు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14వ ఆర్ధిక సంఘం నిధుల్లో కోత విధిస్తున్నారంటూ మండిపడుతున్నారు. నిధులను పంచాయతీలు వినియోగించనీయకుం డా లాక్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.



 జిల్లాలోని పలు పంచాయతీల్లో బంధుప్రీతి, స్వలాభం, లాభాపేక్ష ఎక్కువవుతూ గ్రామ పరిపాలన పడకేసింది. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వర్మీ కంపోస్టు యార్డుల నిర్మాణం కనీసం పది శాతం కూడా అమలు కాలేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అమలు ఘోరంగా ఉంది. గ్రామాల్లో దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని మదన పడుతున్నారు.



ఉప ఎన్నికలు లేవు...

జిల్లాలో 14 మంది సర్పంచ్‌లు, 145 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ తీరుపై ఉన్న వ్యతి రేకతను దృష్టిలో ఉంచుకుని నేటికీ ఉప ఎన్నికలను నిర్వహించడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో పర్సన్‌ ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా సాగుతున్నాయి.



ఏకగ్రీవ పంచాయతీల నిధులపై ఆంక్షలు..  

జిల్లాలోని గడచిన పంచాయతీల ఎన్నికల్లో ఏకగ్రీవంగా నిలిచిన వాటికి ప్రోత్సాహకంగా రూ.5 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉన్నా ఆ నిధులపైనా కొర్రీలు వేశారు. ఆయా గ్రామాల్లో అవసరమయిన పనులు కాకుండా ఇతరత్రా పనులంటూ ఆదేశాలు జారీ చేశారు. తాము సూచించిన పనులకే నిధులు వినియోగించాల నే షరతు పెట్టారు. దీంతో సుమారు రూ.4 కోట్ల నిధులు మురుగుతున్నాయి. ఈ నిధులతోపంచాయతీ పాలక వర్గాలు గ్రామానికి అవసరమయిన పనులు చేసుకునే వీలు లేకుండా పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top