నిమిషం ఆలస్యమైనా...నో ఎంట్రీ


గుంటూరు ఎడ్యుకేషన్ : ఏప్రిల్ 4న జరగనున్న జేఈఈ (మెయిన్స్) పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు గుంటూరు కేంద్రం కో-ఆర్డినేటర్  నామినేని కోటేశ్వరరావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్లో  సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ వివరాలు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి పరీక్ష రాసేందుకు గుంటూరు వస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. నగరంతో పాటు సమీప మండలాల్లోని విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన 43 కేంద్రాల్లో  పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు  చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు.



4వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 ఇంజినీరింగ్ పరీక్షకు 29,083 మంది, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 కేంద్రాల్లో జరిగే పేపర్-2 బీఆర్క్, ప్లానింగ్ పరీక్షలకు 7,399 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఇంజినీరింగ్, బీఆర్క్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి  కేంద్రాలకు చేరుకోవాలని కోటేశ్వరరావు సూచించారు. విద్యార్థులు ఒకరోజు ముందుగానే  కేంద్రాలకు వెళ్లి స్వయంగా పరిశీలించాలని చెప్పారు.



ఉదయం 9.30, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ప్రసక్తి లేదని, దీనిపై సీబీఎస్‌ఈ బోర్టు కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. పరీక్ష సమయానికి అరగంట ముందు నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. జేఈఈ పరీక్ష నిర్వహిస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అధికారుల బృందం ఏప్రిల్ 3వ తేదీన గుంటూరు వచ్చి ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులతో సమావేశం కానున్నారని వివరించారు.

 

రవాణా ఏర్పాట్లు

గుంటూరు నగరానికి సమీప మండలాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ సెంటర్, రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులకు హోటళ్లలో రూమ్‌లను సాధారణ ధరకే అద్దెకు ఇచ్చే విధంగా ఆయా యాజమాన్యాలకు కలెక్టర్ సూచించారని వివరించారు.

 

వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు

పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను జేఈఈ మెయిన్స్.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

 

పరీక్ష నిర్వహణలో మనమే టాప్

జేఈఈ నిర్వహణలో గుంటూరు జిల్లా జాతీయస్థాయిలో పేరు, ప్రఖ్యాతులు సొంతం చేసుకుందని కోటేశ్వరరావు చెప్పారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో గతఏడాది ఈ పరీక్ష  నిర్వహించిన సీబీఎస్‌ఈ బోర్డు గుంటూరు మినహా మరే ఇతర నగరంలోనూ పెద్దస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవని గుర్తించిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top