మైనర్‌పై అత్యాచార యత్నం

మైనర్‌పై అత్యాచార యత్నం

  • నిందితుడు పంచాయతీ కార్యదర్శి

  •  పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు

  •  నిర్భయ చట్టం కింద కేసు నమోదు

  • మాకవరపాలెం: మాయమాటలతో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యదర్శి చివరికి కటకటాలపాలయ్యాడు. ఇంటికి పిలిచి మోసగించేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాన్ని పసిగట్టిన బాలిక తప్పించుకుని విషయం తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండలం పెద్దిపాలెం పంచాయతీ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రామారావు తెలిపిన వివరాలు ఇవీ. పెద్దిపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావు స్థానికంగా నివాసముంటున్నాడు.



    శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలికను తన ఇంటికి పిలిచాడు. ఆమెకు ఎగ్‌పఫ్ ఇచ్చి తినమన్నాడు. అనంతరం నిన్ను పట్నం తీసుకు వెళ్తానని ఆశచూపి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక తప్పించుకుని ఇంటికి పరుగుతీసింది. అన్నం కూడా తినకుండా రాత్రంతా ఏడుస్తూ  కూర్చుంది. ఉదయం ఆమెను గమనించిన తండ్రి ఎందుకు ఏడుస్తున్నావంటూ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో కుమార్తెను తీసుకుని అతను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కార్యదర్శిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

     

    పెద్దిపాలెంలో ఎస్‌ఐ విచారణ



    అత్యాచార యత్నంపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.రామారావు పెద్దిపాలెంలో విచారణ నిర్వహించారు. కార్యదర్శి ఉంటున్న ఇంటితోపాటు బాలిక ఇంటి చుట్టు పక్కల వారిని పిలిచి విచారణ చేశారు. వారు చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top