పార్టీకి ఊడిగం చేయించుకుని ...

కౌన్సిల్ హాలు వద్ద బుచ్చయ్య చౌదరిని నిలదీస్తున్న అఫ్సారీ - Sakshi


రాజమండ్రి : ‘ఇన్నాళ్లూ పార్టీకి ఊడిగం చేయించుకున్నారు. పదవులొచ్చేసరికి నేతలు పంచుకుంటున్నారు... మమ్మల్ని ఇలా అవమానిస్తారా..’ అంటూ ఓ మైనారిటీ మహిళా నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దుమ్మెత్తి పోసింది. ‘‘గంట ముందు వరకూ తిప్పించుకున్నారు.. తీరా మీటింగు హాలుకు వచ్చాక పదవిలేదు పొమ్మంటారా..  ఏ ముస్లిం మహిళా ఇంత వరకూ ఇలా రోడ్డెక్కలేదు. నన్ను ఇలా అవమానిస్తారా..’’ అంటూ తీవ్ర ఆవేదనకు గురైంది. ఆత్మహత్య చేసుకుంటానని రోదించింది.

 

 నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల సందర్భంగా కౌన్సిల్‌హాలు ఎదుట చోటు చేసుకున్న పరిణామం ఇది.  ఏడో డివిజన్‌కు చెందిన మహిళ సయ్యద్ అఫ్సారీకి కో ఆప్షన్ పదవి ఇస్తామని మంగళవారం రాత్రి వరకూ నేత లు నమ్మబలికారు. ఉదయం సమావేశానికి కూడా రమ్మని పిలిచారు. తీరా ఉదయం 11 గంటలకు సమావేశం వద్దకు వస్తే నీకు పదవి లేదు పొమ్మని కబురు చెప్పారు. అనుచరులతో కలసి ఆనందంతో కౌన్సిల్ హాలుకు వచ్చిన మైనార్టీ మహిళా నేత అఫ్సారీ దీనిని తీవ్ర అవమానంగా భావిం చింది.  బుచ్చయ్య చౌదరిపై విరుచుకుపడింది.

 

 నిరసనగా పాత సామాన్లు దగ్ధం

 జాంపేట సెంటర్‌లో మైనారిటీ యువకులు గోరంట్ల వైఖరికి నిరసనగా పాత సామానులు దగ్ధం చేశారు. మైనారిటీ నాయకులను మోసం చేశారని నినాదాలిచ్చారు. జాంపేట లబాబీన్ మసీదు అధ్యక్షులు హబీబుల్లాఖాన్‌కు కో ఆప్షన్ పదవి ఇస్తున్నట్టు చెప్పి, రాత్రికి రాత్రి లేకుండా చేశారని ఆరోపించారు. ఇదేమని అడిగితే సరైన సమాధానం లేదని మండిపడ్డారు. ‘నేను 20 ఏళ్లుగా  పార్టీలో ఉండి, కష్ట పడ్డాను. పదవి కోసం ఆశపడేవాడిని కాను. కానీ ఇస్తానని చెప్పి గతంలో చేసిన వ్యక్తికే కట్టబెట్టడం చాలా అన్యాయం.’’అంటూ హబీబుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.

 

 జాబితా తారుమారు

 కో ఆప్షన్ సభ్యుల ఎంపిక వ్యవహారంలో గోరంట్ల తన ఆధిపత్యం ప్రదర్శించారు. పూర్తిగా తన అనుచర వర్గానికే ఈ పదవులు కట్టబెట్టుకున్నారని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్పొరేషన్‌లో ఐదు కో ఆప్షన్ సభ్య పదవులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ముందుగా అవధానుల సంజీవరావు, కప్పలవెలుగు కుమారి, రెడ్డి మణి, హబీబుల్లాఖాన్, సయ్యద్ అఫ్సారీల పేర్లతో తొలుత టీడీపీ జాబితా సిద్ధం చేసింది.

 

 అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న గోరంట్ల హుటాహుటిన బుధవారం రాజమండ్రి చేరుకుని జాబితాలో మార్పులు చేశారని అవకాశం కోల్పోయిన నేతలు ఆరోపిస్తున్నారు. రెడ్డి మణికి బదులు తన అనుచరురాలు మజ్జి పద్మావతికి, హబీబుల్లాఖాన్ స్థానంలో మంసూర్ షబ్బీర్ అహ్మద్‌కు చోటు కల్పించారు. అఫ్సారీ స్థానంలో ఎస్‌కే నాగ జహ్వార్ ఉన్నీసా పేరు చేరింది.

 

 దీనిపై ఉదయం గోరంట్ల ఇంటి ముందు కూడా కార్యకర్తల్లో భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీడియాను రాకుండా చేసి ఇంటి వద్ద అంతా చక్కబెట్టిన గోరంట్ల కౌన్సిల్ హాల్లో కూడా ఏ వ్యతిరేక నినాదాలూ వినిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంత చేసినా రచ్చ మాత్రం తప్పలేదు.

 

 బీజేపీ వల్లే ఇదంతా...

 జగడం నుంచి బయటపడేందుకు గోరంట్ల తనదైన శైలిలో స్పందించారు. మిత్రపక్షం బీజేపీ సూచించిన అభ్యర్థికి స్థానం కల్పించడం వల్లనే అఫ్సారీకి సీటు ఇవ్వలేక పోయామని వివాదంలోకి బీజేపీని లాగే ప్రయత్నం చేశారు. గొడవ పెద్దది చేసుకుంటే నీకే నష్టం. బీజేపీ సర్దుబాటు వల్ల నీకు ఇవ్వలేక పోయాం’ అని అఫ్సారీకి చెప్పి వెళ్లిపోయారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top