బదిలీలుంటాయా?

బదిలీలుంటాయా?

ఉపాధ్యాయ బదిలీలపై తొలగని సందిగ్ధం.. వెబ్‌ కౌన్సెలింగ్‌ ఉండదని మంత్రి గంటా ప్రకటన 

- వెబ్‌ కౌన్సెలింగ్‌పై అభిప్రాయాలు సేకరిస్తున్న అధికారులు 

- ఇప్పటికే 6 జీవోలు, పది సర్క్యులర్లు జారీ చేసినా వీడని చిక్కుముడులు 

- బదిలీలు ఉంటాయో లేదో తేలక టీచర్ల అయోమయం

 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై సందిగ్ధత తొలగడం లేదు. టీచర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం, పలుమార్లు నిబంధనల మార్పుతో ఈ వ్యవహారం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఆరు జీవోలు, పది సర్క్యులర్లు జారీచేసినా బదిలీలపై ఇప్పటికీ ఒక స్పష్టత రావడం లేదు. బదిలీలుంటాయా? ఉండవా? వెబ్‌కౌన్సెలింగా? మాన్యువల్‌గానా? అనేదానిపై స్పష్టత లేక లక్షలాది మంది ఉపాధ్యాయులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై పక్షం రోజులు దాటినా ఇప్పటికీ బోధన జరగడం లేదు. 

 

నెరవేరని మంత్రి హామీ : బదిలీలపై ఇటీవల టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. ఉపాధ్యాయ సంఘాలు ‘చలో అమరావతి’కి పిలుపునిచ్చాయి. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం సంఘాలతో చర్చించింది. పనితీరు పాయింట్లను 30 శాతానికి తగ్గిస్తామని, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే, మంత్రి ప్రకటనకు విరుద్ధంగా అధికారులు వెబ్‌ కౌన్సెలింగ్‌పై టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించడం వివాదాస్పదంగా మారుతోంది. అధికారులు టీచర్లకు నేరుగా ఫోన్లు చేస్తూ వెబ్‌కౌన్సెలింగ్‌పై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. 

 

తక్షణమే బదిలీలు చేపట్టాల్సిందే: ఉపాధ్యాయల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం, కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో రాష్ట్రంలోని ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్‌ లెక్చరర్‌ తదితర పోస్టులను భర్తీ చేసి, ఆ తర్వాత బదిలీలను చేపట్టాలన్న ప్రతిపాదనను మంత్రి గంటా శ్రీనివాసరావు తెరపైకి తెచ్చారు. అయితే, ఏకీకృత సర్వీసు నిబంధనలు, పదోన్నతులతో సంబంధం లేకుండా బదిలీలను తక్షణమే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు బదిలీలు చేయాలన్నా మళ్లీ కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన బదిలీల షెడ్యూల్‌లో మూడుసార్లు మార్పు జరిగింది. పనితీరు పాయింట్ల మార్పుతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడా షెడ్యూల్‌ను కూడా మార్పు చేయాల్సి ఉంటుంది. 

 

గడియకో నిర్ణయం, రోజుకో మార్పు

► రేషనలైజేషన్‌పై ఈ ఏడాది మే 5న పాఠశాల విద్యాశాఖ జీవో నంబర్‌ 29ను విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య 20 కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 30 మంది కంటే తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 మంది కంటే తక్కువ ఉన్న హైస్కూళ్లను మూసివేయాలని పేర్కొంది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లను మరో స్కూల్‌లో విలీనం చేయాలంటూ నిబంధనలు మారుస్తూ జీవో నంబర్‌ 30ని జారీ చేసింది. ఆ రెండు జీవోల్లోనూ అస్పష్టత ఉండడంతో కొన్ని సర్క్యులర్లు ఇచ్చారు. 

► బదిలీలపై ముందుగా జీవో నంబర్‌ 31ను విడుదల చేశారు. ఏ శాఖలోనూ లేని విధంగా మైనస్‌ పాయింట్లు, పనితీరు పాయింట్లు రెట్టింపు చేయడంపై టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో జీవో 32ను విడుదల చేశారు. 

► జీవో 32లోనూ స్పష్టత కొరవడడంతో దాన్ని సవరిస్తూ జీవో 33ని విడుదల చేశారు. పనితీరు పాయింట్లపై టీచర్ల వ్యతిరేకతతో వాటిని 40 శాతానికి తగ్గిస్తూ జీవో 38ని విడుదల చేశారు. ఈ జీవోలన్నింటిపై మళ్లీ వివరణలు ఇస్తూ 10 సర్క్యులర్లు జారీ చేశారు.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top