‘చిక్కరు... దొరకరు... కనపడరు’

‘చిక్కరు...  దొరకరు... కనపడరు’ - Sakshi


సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంటు సభ్యుడు, ఇద్దరు మంత్రులు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారారు. వారి గురించి  ‘చిక్కరూ, దొరకరు, కనపడరని’ ఆ పార్టీ కార్యకర్తలే సరదా కామెంట్లు విసురుతున్నారు. పార్లమె ంటు సమావేశాలు ముగిసి పది రోజులు దాటినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు.



రాష్ట్ర మంత్రుల్లో ప్రత్తిపాటి పుల్లారావు అడపాదడపా వస్తున్నా, రావెల కిషోర్ దొరకడం లేదు. నిత్యం అందుబాటులో ఉంటామని, సమస్యలు పరిష్కరిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని, పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన ఈ నేతలు వాటిని పూర్తిగా విస్మరించారు. కనీసం ఫోన్‌కాల్స్‌కు కూడా స్పందించడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

* ప్రత్తిపాటి పుల్లారావుకు జిల్లాలో కేరాఫ్ అడ్రస్ అంటూ ఒకటి ఉందని, రావెల కిషోర్, గల్లా జయదేవ్‌లకు కేరాఫ్ అడ్రస్‌లు లేకపోవడంతో ఎక్కడ కలుసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు, కార్యకర్తలు వాపోతున్నారు.

* ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరుపై నిఘా ఉందని, దాని ఆధారంగా మార్కులు ఉంటాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ టీమ్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడమే కాని ఆ పరిస్థితులేవీ జిల్లాలో కనపడటం లేదు.

* ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి పలు మార్లు మంత్రి రావెలకు ఫోన్ చేసినా స్పందించ లేదు. చిన్నపాటి బదిలీలు, సమస్యలు పరిష్కరించు కోలేని దుస్థితిలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అందుబాటులో ఉన్నా స్థానిక నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోన రగిలిపోతున్నారు.

* ఎంపీ గల్లా జయదేవ్ పరిస్థితి మరీ విచిత్రం. ఆయనకు గుంటూరులో స్థిర నివాసం లేదు. కుటుంబ సభ్యులూ ఇక్కడ ఉండరు. దాంతో ఆయన రాకపోకల సమాచారం పార్టీ ముఖ్యనేతలకీ తెలియడం లేదు.

* సామాన్య ప్రజలకు ఆయన కార్యాలయ గడప తొక్కే పరిస్థితే లేదు. ఖరీదైన కారుల్లో వచ్చే వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటోంది.

* సాగునీటి సమస్య ఎదుర్కొంటున్న రైతులు ఎంపీ జయదేవ్ అందుబాటులో లేకపోవడంతో ఎంపీటీసీ, జెడ్సీటీసీ సభ్యులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

* ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన గల్లా చివరకు గుంటూరులో ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేదని, ఇక ఈయనేం అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శిస్తున్నారు.

* మంత్రి పుల్లారావు జిల్లాకు వచ్చినప్పుడు కలిసేందుకు వెళ్లిన సామాన్య ప్రజలు, కార్యకర్తలను సెక్యూరిటీ సిబ్బంది బయటకు నెట్టివేస్తున్నారు. కనీసం మంత్రి బయటకు వచ్చినప్పుడైనా తమవైపు చూడకపోతారా అని వేచి చూసే కార్యకర్తలకు నిరాశే మిగులుతోంది.

*   చివరకు హైదరాబాద్‌లో కలుద్దామని వెళ్లినా అక్కడా చుక్కెదురవుతో ంది.  కేవలం నిమిషం సమయం కేటాయించి ఇక్కడి వరకు రావాలా...నియోజవర్గంలోనే కలుద్దాం అంటూ మంత్రి వారిని సున్నితంగా తిప్పి పంపుతున్నారు.

* ఓట్లు వేసి గెలిపించుకున్న తమ నాయకుడు మంత్రి అయ్యారనీ, తమ కూ మేలు చేస్తారని కలలు కంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో అంతర్మథనం ఆరంభమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top