సోమిరెడ్డి బలప్రదర్శన

సోమిరెడ్డి బలప్రదర్శన - Sakshi


► ఆనం సోదరులు, ఆదాల డుమ్మా

► ఒక వైపు స్నేహ హస్తం అందిస్తూనే మరో వైపు సత్తా చాటే వ్యూహం

► పార్టీ మొత్తం తన వెంటే ఉందని చూపించే ప్రయత్నం

► నెల్లూరులో భారీ ర్యాలీ, బహిరంగ సభ




సాక్షి ప్రతినిధి – నెల్లూరు:

పదమూడేళ్ల తర్వాత మంత్రి పదవి దక్కించుకుని శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు నగరం వేదికగా బల ప్రదర్శన చేశారు. ఒక వైపు పార్టీలోని వైరి వర్గాలకు స్నేహ హస్తం అందించే ప్రయత్నం చేస్తూనే వారికి తన బలం ఏమిటో చూపించే ప్రయత్నం చేశారు. సోమిరెడ్డి స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. పార్టీ హై కమాండ్‌ ఆదేశం మేరకు మంత్రి నారాయణ ఆద్యంతం సోమిరెడ్డి వెంటే ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో పాటు సర్వేపల్లి, నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజక వర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరించారు.



తెలుగుదేశం పార్టీ  2004 నుంచి 2014 వరకు అధికారంలో లేకపోవడం, 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల అధినేత నారాయణకు పెత్తనం దక్కడంతో సోమిరెడ్డి ప్రాధాన్యత తగ్గింది. కొంతకాలం పాటు పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఎమ్మెల్సీ అయ్యాక అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు జిల్లా నాయకులతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. తన మద్దతు దారులకు పార్టీ, అధికార పదవుల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వక పోయినా ఎక్కడా వివాదాలకు పోకుండా సమయం కోసం వేచి చూస్తూ వచ్చారు. మంత్రి పదవి సాధించి జిల్లా రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని గురి పెట్టి ఏడాది కాలంగా సర్వ శక్తులు ఉపయోగించి, తెలివిగా అడుగులేస్తూ వచ్చారు.



తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం కోసం మంత్రి నారాయణ బీసీ కార్డుతో బీద రవిచంద్రను తెర మీదకు తెచ్చినా తన ఆగ్రహాన్ని మనసులోనే దాచుకుని జాగ్రత్తగా వ్యవహరించారు. ఇదే సందర్భంలో జిల్లా పాలనా యంత్రాంగం మీద మంత్రి నారాయణకు పట్టు లేకపోవడం, ఇటీవల జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ లాంటి వైఫల్యాలను తెలివిగా వాడుకున్నారు. మంత్రి పదవి చేతికి రాగానే జిల్లాలోని వైరి వర్గాలతో పాటు, తటస్థంగా ఉన్న వారిని సైతం తన నాయకత్వంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ రకంగా చేయడం ద్వారా 2019 ఎన్నికల నాటికి జిల్లా పార్టీ మీద పూర్తి ఆధిపత్యం సాధించే దిశగా అడుగులు ప్రారంభించారు.



ఆ ముగ్గురూ డుమ్మా

సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం సోమిరెడ్డి నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభకు హాజరు కాలేదు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన సోమిరెడ్డి రెండు రోజుల కిందట వీరికి స్వయంగా ఫోన్‌ చేసి ర్యాలీ, బహిరంగ సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. తన మనుషులను ఆనం, ఆదాల మద్దతు దారుల ఇళ్లకు పంపి కార్యక్రమానికి ఆహ్వానించారు. బీద రవిచంద్ర ఆనం వివేకా, రామనారాయణ ఇళ్లకు వెళ్లి మరీ ఆహ్వానించి వచ్చారు. అయితే ముందుగా ఊహించిన విధంగానే ఆనం సోదరులు శుక్రవారం నాటి కార్యక్రమాలకు ముఖం చాటేసి సోమిరెడ్డిపై తమ అసంతృప్తిని బహిర్గత పరిచారు.



రామనారాయణరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఆనం వివేకానందరెడ్డి నగరంలోనే ఉన్నా కార్యక్రమాలకు హాజరు కాలేదు. తన ఇంటికి కూత వేటు దూరంలోని నర్తకి సెంటర్‌లో బహిరంగ సభ జరుగుతున్నా వివేకా ఇంట్లోనే ఉండిపోయారు. అత్యవసర పనుల పేరిట మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. పార్టీ హై కమాండ్‌ ఆదేశం మేరకు మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర వీఆర్‌సీ సెంటర్‌లో ర్యాలీ ప్రారంభమై నర్తకి సెంటర్‌లో బహిరంగ సభ ముగిసే వరకు సోమిరెడ్డితో పాటే ఉన్నారు.



స్వయంగా ఫోన్లు

మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి జిల్లాకు వస్తున్న తన పర్యటనను విజయవంతం చేసుకోవడం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాలోని ముఖ్య నేతలందరికీ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌ కుమార్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి, సాయికృష్ణ యాచేంద్ర,  బీద మస్తాన్‌రావు,  పరసారత్నం, నెలవల సుబ్రమణ్యం, తాళ్లపాక రమేష్‌రెడ్డి, నెల్లూరు మేయర్‌ అజీజ్, గూడూరు, వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు దేవసేనమ్మ, దొంతు శారద, నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కిలారి వెంకటస్వామి నాయుడు హాజరయ్యారు.



విజయా డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, బీజేపీ నేతలు సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఆంజనేయరెడ్డి, నెల్లూరు కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ జెడ్‌.శివప్రసాద్, కోవూరు నియోజకవర్గ ముఖ్య నాయకుడు పెళ్ల కూరు శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు జెడ్‌పీటీసీలు, కౌన్సిలర్లు సైతం సోమిరెడ్డి ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నాయకులంతా సోమిరెడ్డిని ప్రజా నాయకుడు, కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడని పొగడ్తలతో ముంచెత్తడం వేదిక మీదే ఉన్న మరో మంత్రి నారాయణను కాస్త ఇబ్బంది పెట్టినట్లుగా కనిపించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top