'ప్రయాణికులకు ఇబ్బందులు రానివ్వం'

'ప్రయాణికులకు ఇబ్బందులు రానివ్వం' - Sakshi


గోదావరి పుష్కరాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు

13 జిల్లా నుంచి పుష్కరాలకు 1600 బస్సులు


రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు



హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా రవాణా సౌకర్యాలను కల్పిస్తామని రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గోదావరి పుష్కరాలకు రవాణా ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీ సాంబశివరావు, రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జూలై 14 నుంచి 26 వరకూ నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పుష్కరాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకు రూ.785 కోట్లను మంజూరు చేశామని చెప్పారు. ఆ పనుల్లో 95 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పనులను నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు.



రాష్ట్రంలో 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు 1600 బస్సులను ప్రత్యేకంగా కేటాయించామని చెప్పారు. రాజమండ్రి, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు నుంచి పుష్కర ఘాట్ల వరకూ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు 300 బస్సులను ఆర్టీసీ సమకూర్చుతుందన్నారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా పుష్కర ఘాట్లకు తీసుకెళ్లి.. మళ్లీ బస్టాండు, రైల్వే స్టేషన్, విమానాశ్రయాల వద్దకు చేర్చుతామని చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు 160 కిమీల మేర బారీ కేడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు వేయాలని రైల్వే శాఖను కోరుతామని చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రత్యేక విమానాలు, హెలీ కాఫ్టర్‌లను నడపాలని కేంద్ర విమానయాన శాఖను కోరుతామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top