వ్యాపారం కోసం ఎక్కడ్నుంచో రాలేదు


మంత్రి గంటాపై అయ్యన్న పరోక్ష విమర్శలు,వాగ్బాణాలు

వారు పార్టీలో ఎన్నాళ్లుంటారో తెలీదు... నేను మాత్రం పార్టీలోనే ఉంటా

మాడుగుల నియోజకవర్గంలో  పర్యటన

గంటా వర్గాన్ని నేరుగా  టార్గెట్ చేసిన మంత్రి


 

 కె.కోటపాడు : ‘నేను కొందరిలా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రాలేదు. వ్యాపారం కోసం వచ్చినవాడిని కాను. వాటి కోసం రాజకీయాలు చేస్తున్నవాడిని కాదు. వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎన్నాళ్లుంటారో...ఏ పార్టీలో ఉంటారో నాకు తెలీదు. నేను మాత్రం 34ఏళ్లుగా టీడీపీలోనే ఉంటున్నా. రాజకీయ కుటుంబంలో పుట్టాను. రాజకీయాల్లో  పెరిగాను. ఎన్టీఆర్ యూనివర్సిటీలో క్రమశిక్షణ నేర్చుకున్నాను’అని మంత్రి అయ్యన్న పాత్రుడు పరోక్షంగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై విమర్శలు, వాగ్బాణాలు గుప్పించారు. మంత్రి గంటా, ఎంపీ అవంతి  శ్రీనివాస్‌ల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మాడుగుల నియోజకవర్గంలో శుక్రవారం పలు అధికారిక కార్యక్రమాల్లో మంత్రి అయ్యన్న పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు కారణంగా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్‌కు ఎంపీ శ్రీనివాస్  ఇటీవల లేఖ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ లేకుండానే కె.కోటపాడు మండలం ఆనందపురంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అయ్యన్నను పూలమాలలతో కార్యకర్తలు సన్మానిస్తున్న సమయంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కె.కోటపాడులో పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. దేవరాపల్లిలో స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. అనంతగిరి మండలంలో మినీ జలాశయాన్ని ప్రారంభించి నీళ్లు విడిచిపెట్టారు. అనంతరం ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీడికాడలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించి రక్షితమంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మాడుగులలో రూ.1.09కోట్లతో వివిధ పనులకు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగులలో నిర్వహించిన సభల్లో మంత్రి అయ్యన్న  మాట్లాడుతూ మంత్రి గంటా, ఆయన వర్గంపై పరోక్షంగా చేసిన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు తీవ్ర ఆసకి ్తకలిగించాయి. కె.కోటపాడులో నిర్వహించిన సమావేశంలో మంత్రి అయ్యన్న తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నారు...‘ టీడీపీలో ప్రతి కార్యకర్తను పేరుపెట్టి పిలిచేంత చనువు నాకుంది. నా విషయంలో కార్యకర్తలు ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులను పూలమాలలతోనే సత్కరిస్తే వారి దృష్టిలో పడతామని కార్యకర్తలు భావిస్తారని కాని నా విషయంలో కార్యకర్తలు ఇటువంటి ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ ఓటమి చెందినా.. పదవులు లేకపోయినా టీడీపీలోనే ఉన్నాను.



పదవుల కోసం పార్టీలు మారలేదు. పదవుల కోసం పార్టీలోనికి వచ్చిన వారు పార్టీలో ఉంటారోలేదో తెలియదు గాని తాను మాత్రం టీడీపీలోనే ఉంటాను. నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు’అని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికలు లేవు. కాబట్టి రాజకీయాలు చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారిద్దామని మంత్రి అయ్యన్న చెప్పారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ప్రతిపక్ష పార్టీకి చెందినవారైనప్పటికీ ఆయనతో కలసి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తాననన్నారు. నర్సీపట్నంతో సమానంగా మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిపరుస్తానని ప్రకటించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top