మంత్రి గంటా రాజకీయ ఊసరవెల్లి


  • అమాత్యుని అవినీతి పెరుగుతోంది

  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్

  • విశాఖపట్నం (తగరపువలస): తరచూ పార్టీని..నియోజకవర్గాన్ని మార్చే మంత్రి గంటా శ్రీనివాసరావును రాజకీయ ఊసరవెల్లిగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ అభివర్ణించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుద్‌హుద్ తుపాను తర్వాత భీమిలి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పర్యటించారో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడంతో విఫలమైనందున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మందలించారన్నారు.



    అందువల్లే గంటా అలిగి పడుకున్నారన్నారు. వైఎస్.జగన్‌మోహనరెడ్డి భీమిలి తోటవీధి, బోయివీధిలో పర్యటించినప్పుడు గంటా ఇక్కడే ఉండి ఇప్పటివరకు తాము బతికున్నామో చచ్చామో కూడా చూడలేదని మత్స్యకారులు వాపోయిన సంగతిని గుర్తు చేశారు .అలాంటి గంటాకు వైఎస్.జగన్‌మోహనరెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. పోటీ చేయాలని ఉవ్విళ్లూరితే అసెంబ్లీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి కర్రి సీతారామ్‌పై పోటీచేసి గెలుపొందాలని సవాల్ విసిరారు.

     

    అవినీతి, కబ్జాలకు మారుపేరు గంటా..



    మంత్రి అనుచరుడు భాస్కరరావు ఇటీవల రూ.475 కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడినట్టు ఒక దినపత్రికలోనే ప్రచురితమైందన్నారు. తుపాను తర్వాత 20 రోజులకు తన తల్లిపేరిట కార్యక్రమానికి వ్యాపారులను, విద్యాసంస్థలను బెదిరించి రూ.లక్షలు చందాలుగా వసూలు చేశారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఎయిడెడ్ ఉపాద్యాయుల విరమణ వయసు పెంచడానికి విద్యాశాఖలో అవినీతి జరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రాబాబే ఇతర మంత్రుల ముందు అంగీకరించి తర్వాత గంటాను వెనకేసుకురావడంతో ఆయనకూ ఇందులో వాటా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.



    అక్రమంగా ఉపాధ్యాయులను బదిలీ చేయడానికి పైరవీలు చేస్తూ గంటా కుటుంబ సభ్యులే రూ.లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. భీమిలి ఇన్‌చార్జ్ కర్రి సీతారామ్ మాట్లాడుతూ భీమిలిలో గంటా గెలుపు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఓట్లు చీల్చలేకపోవడంతోనే సాధ్యమైందన్నారు. 2009లో భీమిలిలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్ల కంటే 2014లో తనకే అధికంగా ఓట్లు లభించాయన్నారు. దమ్ముంటే మళ్లీ ఇప్పుడు తనపై పోటీచేసి గెలవాలన్నారు. భీమిలి పట్టణ ఇన్‌చార్జి అక్కరమాని వెంకటరావు మాట్లాడుతూ చిట్టివలస జూట్‌మిల్లును తెరిపించడంతో మంత్రి గంటాతో పాటు కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విఫలమయ్యారన్నారు.

     

    నేటినుంచి వైఎస్సార్‌సీపీ వార్డు కమిటీలు



    వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ పరిధిలో వార్డు కమిటీలు ప్రకటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భీమిలి విలీనంపై పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత జోన్‌లో కూడా కమిటీల వేస్తామన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top