భక్తి సాగరం

భక్తి సాగరం


సూర్యలంక తీరంలో  కార్తీక కాంతులు

సాగర హారతి వీక్షించేందుకు   పోటెత్తిన పర్యాటకులు

లక్షల సంఖ్యలో భక్తుల పుణ్యస్నానాలు

కిక్కిరిసిన శైవాలయాలు..     దీపాలతో ప్రత్యేక పూజలు

కోటప్పకొండపై వైభవోపేతంగా జ్వాలాతోరణం


 

బాపట్లటౌన్/నరసరావుపేట రూరల్  కార్తీకపౌర్ణమిను పురస్కరించుకొని సూర్యలంక, నిజాంపట్నం సముద్రతీరాలకు బుధవారం పర్యాటకులు పోటెత్తారు.  ఉదయాన్నే సూర్య నమస్కారాలతో కూడిన  పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుక తిన్నెలపై పిండి ముగ్గులేసి, మధ్యలో గొబ్బెమ్మలుంచారు. ఇసుకతో తయారుచేసిన గౌరీదేవి ప్రతిమలకు ప్రత్యేకపూజలు నిర్వహించి, గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లు సముద్రంలోకి వదిలారు. సూర్యలంక తీరానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజామున 3.30 గంటల నుంచే తీరానికి వచ్చారు. భక్తులు, అయ్యప్ప, భవానీ, శివ మాలలు ధరించిన దీక్షాపరులు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలోను, తీరం వెంబడి నూతనంగా ఏర్పాటుచేసిన శివలింగం, నందీశ్వరుని ప్రతిమలకు పూజలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన యువకులు, వివిధ కళాశాలల విద్యార్థులు ఆహ్లాదకర తీరంలో కేరింతలు కొట్టారు.



అప్రమత్తమైన అధికార యంత్రాంగం..

పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో సూర్యలంక తీరానికి పర్యాటకులు వస్తారని ముందుగానే అంచనావేసిన పోలీసుశాఖ తీరంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 15 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటుచేశారు. బాపట్ల డిఎస్పీ పి.మహేష్ ఆధ్వర్యంలో 750 మంది పోలీసులు తీరంలో విధులు నిర్వర్తించారు. మత్స్యశాఖాధికారి ఉషాకారిణ్ ఆధ్వర్యంలో తీరంలో 5 ప్రత్యేకబోట్లు, 50 మంది గజఈతగాళ్ళను అందుబాటులో ఉంచారు. మండలంలోని అప్పికట్ల, వెదుళ్ళపల్లి, నరసాయపాలెం పీహెచ్‌సీల పరిధిలోని ఆరోగ్యసిబ్బంది వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. రెడ్‌క్రాస్ తరపున 120 మంది ఎన్‌సీసీ, 120 ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సాయంత్రం వరకు తీరంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.



త్రికోటేశ్వరుని సన్నిధిలో జ్వాలాతోరణం..

 కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండపం ఎదుట జ్వాలాతోరణం ఏర్పాటుచేసి పూజలు నిర్వహించగా.. భక్తులు ఆ తోరణం గుండా ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆలయ ట్రస్టీ రామకృష్ట కొండలరావు, ఈవో శ్రీనివాసరావు, సుధాకరరెడ్డి, సిబ్బంది  పాల్గొన్నారు.



రెంటచింతల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 108 కోట్ల వత్తులతో దీపారాధన నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని శ్రీ కాశీవిశ్వనాథుని ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. రేపల్లె పట్టణం ఇసుకపల్లిలోని అయ్యప్ప ఆలయంలో లక్ష వత్తులతో శివలింగాకృతిలో దీపాలు వెలిగించారు. నిజాంపట్నం సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

 

తొలిసారి సాగర హారతి..

కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రం వద్ద సాగరు హారతి ఇచ్చి సముద్రస్నానాలను ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ఉదయం 4.30గంటలకు వేదపండితుల సమక్షంలో హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర హారతి ఇవ్వటం ఇదే తొలిసారి కావటంతో భక్తులు భారీగా కార్యక్రమానికి పాల్గొన్నారు. వల్లూరు భావన్నారాయణ, నెమ్మలికంటి హనుమంతరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తెనాలి ఆర్డీఓ నరసింహులు, త హశీల్దార్ టి.వల్లయ్య, మున్సిపల్‌చైర్మన్ తోట నారాయణ, ఎంపీపీ మానం విజేత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top