వికటించిన మధ్యాహ్న భోజనం

వికటించిన మధ్యాహ్న భోజనం - Sakshi


తొండూరు : తొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం విషాహారమై పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు పది మంది విద్యార్థులు ఒక్కొక్కరిగా ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం పాఠశాలలో కలకలం రేపింది. ఏం జరిగిందో తెలీయ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు.

 

 జరిగిందెలాగంటే..

 రోజులాగే ఏజెన్సీ నిర్వాహకురాలు మధ్యాహ్న భోజనం వండింది. అయితే మధ్యాహ్నం 12.30 గంటలకు బదులు ఆలస్యంగా అంటే 2.30 గంటలకు విద్యార్థులకు వడ్డించింది. అయితే అన్నం సరిగా ఉడకలేదని విద్యార్థులు ఆరోపించారు. ఉడికీ ఉడకని అన్నం తినడంతో పది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. ఏజెన్సీ నిర్వాహకురాలి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు.  

 108లో ఆస్పత్రికి తరలింపు

 సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది రంగంలోకి దిగారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే తొండూరు పీహెచ్‌సీకి తరలించారు. వారికి డాక్టర్ గిరిధర్, పులివెందుల క్లస్టర్ అధికారొ కొండయ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. దీంతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది.

 

 ఎంపీపీ పరిశీలించి వెళ్లిన గంటకే..

 తొండూరు ఎంపీపీ జయప్రద గురువారం పాఠశాలను సందర్శించారు. పనిలో పనిగా ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వెళ్లారు. ఆమె వెళ్లి గంట గడిచిందో లేదో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఏజెన్సీ నిర్వాహకురాలిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధ్వజమెత్తారు.  

 

 ఆగ్రహంతో ఆందోళనకు

 దిగిన విద్యార్థులు

 తమ పాఠశాలలో జరిగిన సంఘటనను నిరసిస్తూ విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. ప్లేట్లతో నిరసనకు దిగారు. వంట ఏజెన్సీ నిర్వాహకురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను ఇన్నాళ్లూ వెనకేసుకు వచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంట నిర్వాహకురాలిపై చర్యలు తీసుకుంటామని హెడ్మాస్టర్ జసింతరాణి ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.  

 

 విద్యార్థులకు పరామర్శ

 అస్వస్థతకు గురై, తొండూరు పీహెచ్‌సీలో కోలుకుంటున్న విద్యార్థులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి పరామర్శించారు. డాక్టర్ గిరిధర్‌తో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. ఎంపీపీ భర్త రవీంద్రరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలి భర్త లక్ష్మీనారాయణరెడ్డి సహా ఇతర నాయకులు, కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top