మాఫీపై.. రోజుకో మాట

మాఫీపై.. రోజుకో మాట - Sakshi

  • రుణమాఫీలో గందరగోళం    

  •  ఆందోళనలో రైతులు

  •  మొన్న రూ.1.5 లక్ష..ఇప్పుడు 20 శాతమేనని ప్రకటన

  •  కొత్త రుణాల మంజూరులో అయోమయం

  • సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రుణమాఫీ విషయంలో సీఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు రైతులు, డ్వాక్రా, చేనేత రుణాలన్నింటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకంతోనే రైతులు, డ్వాక్రా మహిళలను రుణవిముక్తుల్ని చేస్తానని పేర్కొన్నారు. ఎవ్వరూ రుణాలు చెల్లించొద్దని ప్రకటించారు.



    చంద్రబాబు మాయ మాటలను నమ్మి జనం ఓట్లేసి, ముఖ్యమంత్రిని చేశారు. నమ్మిన జనాన్ని తొలి సంతకంతోనే చంద్రబాబు మోసం చేశారు. రుణాల మాఫీకి కాకుండా అధ్యయనకమిటీ నియామకానికి సంతకం పెట్టి తన నైజాన్ని మరోసారి బయటపెట్టారు. ఆ తర్వాత రోజుకో మాట చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. మొన్న ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర మాఫీ అన్నారు. మొదటి విడతగా రూ.50వేలు చెల్లిస్తామన్నారు. తాజాగా రుణం తీసుకున్న వారికి 20శాతం చెల్లించి, మిగిలిన మొత్తాన్ని మరో మూడు పర్యాయాలుగా చెల్లించి రుణవిముక్తిల్ని చేస్తామని ప్రకటించారు. రైతు రుణవిముక్తికే సాధికార సంస్థ అని ఆర్భాటంగా ప్రారంభించారు.

     

    జిల్లాలో ఇదీ పరిస్థితి : జిల్లాలో మొత్తం 5,01,637 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.1,944 కోట్లు రుణాలు పొందారు. అదే విధంగా 2,66,340 మంది రైతులు బంగారాన్ని తాకట్టుపెట్టి రూ.2,597 కోట్లు పొంది ఉన్నారు. ఈ మొత్తానికి ఏడాదికి రూ.545 కోట్లు వడ్డీనే చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు రుణాలు చెల్లిస్తారన్న ఆశతో రైతులెవ్వరూ రుణాలు కట్టలేదు.వడ్డీల జోలికే వెళ్లలేదు. జూలై గడువు పూర్తవ్వటంతో పంట రుణాలపై బ్యాంకర్లు 14శాతం వడ్డీ విధిస్తున్నారు.



    ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవటంతో రైతులకు ఖరీఫ్‌లో రుణాలు పొందలేకపోయారు. కనీసం రీషెడ్యూల్ కూడా చేయలేకపోవటంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఈ ఏడాది రైతు సాధికార సంస్థ ద్వారా రైతుల అప్పుల్లో 20శాతాన్ని మాత్రమే చెల్లిస్తామని, ఆమేరకు రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.



    అంటే ఒక రైతు రూ.లక్ష రుణం పొంది ఉంటే అతనికి మొదటి విడతగా రూ.20వేలు జమచేస్తారు. మిగిలిన రూ.80వేలను నాలుగేళ్లలో చెల్లించి రుణాల నుంచి విముక్తుల్ని చేస్తామని వెల్లడించారు. ఈ లోపు రైతులు తీసుకున్న రుణాలకు రైతులు 14శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఓ బ్యాంక్ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోతే రైతుల ఆస్తులు, బంగారాన్ని వేలానికి పెట్టాల్సి వస్తుందని ఆ అధికారి స్పష్టం చేశారు.

     

    రుణ విముక్తి అయ్యేవరకు రుణాలు లేనట్టే? : ప్రభుత్వం ఎంత తొందరగా రైతులను రుణాల నుంచి విముక్తుల్ని చేస్తేనే తిరిగి రుణాలు పొందే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వం ప్రకటించిన కాలం ప్రకారం నాలుగేళ్ల వరకు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం లేదని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే రైతులకు బ్యాంకుల్లో అప్పులు పుట్టక, ఉన్న ఆస్తులను బయట తాకట్టు పెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే వ్యవసాయ రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top