అమర వీరుల త్యాగాలు మరువలేనివని..

అమర వీరుల త్యాగాలు మరువలేనివని.. - Sakshi


ఒంగోలు క్రైం: పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని రాష్ర్ట రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తొలుత కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్, ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావుతో కలిసి పోలీసు అమరవీరులకు  శిద్దా శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.



అనంతరం మంత్రి మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర గణనీయమైందన్నారు. అమరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని పోలీసులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని కోరారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విధులు నిర్వర్తించినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. నిజాయితీగా పనిచేసే పోలీసులు, అధికారులు ప్రజల మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన వారికి అండగా ఉండటమే పోలీసుల విధి అన్నారు. అమరుల త్యాగాలను

 

ఇనుమడింపజేసేలా పోలీసుల పనితీరు ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని..అంతా స్నేహపూరిత వాతావరణంలో ఉండాలని సూచించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 642 మంది పోలీసులు అమరులయ్యారని, వారి ఆదర్శాలను తివాచీలుగా చేసుకుని ముందుకు నడవాలని కోరారు. వారి త్యాగాలను మననం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఆరుగురు పోలీసులు, పోలీసు అధికారులు అమరులయ్యారని ప్రజలు వారిని ఎన్నటికీ మరువరన్నారు. అమరవీరుల కుటుంబాలకు అందరం కలిసికట్టుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడినప్పుడే మంచి పోలీసులుగా పేరు తెచ్చుకుంటారని, పనితీరు మెరుగుపరుచుకుని విధులు నిర్వర్తిస్తే ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతుందని అన్నారు.



కార్యక్రమంలో అదనపు ఎస్పీ బీ రామానాయక్, ఏఆర్ ఏఎస్పీ జే కృష్ణయ్యలతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యేలు డా.దివి శివరాం, బీఎన్ విజయకుమార్ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మంత్రితోపాటు కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేకంగా మాట్లాడారు. కుటుంబ సభ్యులు అమరులతో ఉన్న అనుబంధాలను మననం చేసుకుని కళ్లు చెమర్చారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసు శాఖలోని పోలీసులు, అధికారులతోపాటు, వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.   

 

పోలీసుల ర్యాలీ...

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి పోలీసులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కర్నూలురోడ్డు ఫ్లైఓవర్ మీదుగా కర్నూలురోడ్డు, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. అనంతరం అక్కడి నుంచి తిరిగి ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top