300 ఏళ్ల నాటి అపురూపఘట్టం

300 ఏళ్ల నాటి అపురూపఘట్టం

► 1717 హేమలంబి సంవత్సరంలో.....

►  సిద్దవటం కోటపై దాడి సంఘటన



కడప కల్చరల్‌ : జిల్లా చరిత్రలో ఇదొక చారిత్రక సంఘటన. సరిగ్గా 300 సంవత్సరాల క్రితం 1717లో హేమలంబి సంవత్సరంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. కడప నవాబు సిద్దవటం కోటను వశం చేసుకున్న ఆనాటి సంఘటనను నేడు గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వారం రోజుల్లో 2017 హేమలంబి నామ సంవత్సరం రానుంది. సరిగ్గా 300 సంవత్సరాల క్రితం అంటే 1717లో ఇదే హేమలంబి సంవత్సరం నాడు ఈ సంఘటన జరిగింది. ఈ అపురూపమైన సందర్బాన్ని పురస్కరించుకుని నాడు జరిగిన ఆ సంఘటనను ఈ హేమలంబి నామ సంవత్సర ఉగాది సందర్బంగా సాక్షి పాఠకుల కోసం కానుకగా ప్రత్యేకంగా అందిస్తున్నాం!

 

నాడు సిద్దవటం కోట కేంద్రంగా ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంది. నాటి కడప పాలకుడు మయాన నవాబు అబ్దుల్‌ నబీఖాన్‌ సిద్దవటం కోటను ఎంతగానో ఇష్టపడ్డాడు. దాన్ని ఎలాగైనా జయించి తనపాలనలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అత్యంత తెలివైన పాలకుడిగా పేరుగాంచిన నబీఖాన్‌ సిద్దవటం కోటను వశపరుచుకునేందుకు వ్యూహ రచన చేశాడు. అప్పట్లో సిద్దవటం కోటను ఆర్కాట్‌ పాలకుడు సాదతుల్లాఖాన్‌ పక్షాన ఫత్తేసింగ్‌ ఖిలేదారుడిగా పాలించేవాడు.

 

ఆదుకోండి: ఓరోజు అబ్దుల్‌ నబీఖాన్‌ ఫత్తేసింగ్‌కు ఉత్తరం రాశాడు. మహరాష్ట్ర నుంచి తమ రాజ్యంపైకి మహరాష్ట్ర సైనికుల దండు వస్తోందని, తమ జనానలోని మహిళలకు కొద్దికాలం రక్షణ ఇవ్వాలని, దాడి అనంతరం తిరిగి జనానను రప్పించుకుంటామని రాశారు. మహిళలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఈ విపత్కర సమయం నుంచి కాపాడాలని కోరారు. ఉత్తరం చూసి స్పందించిన ఫత్తేఖాన్‌ అందుకు ఒప్పుకున్నాడు.

 

మెరుపు దాడి: పథకం ప్రకారం అబ్దుల్‌ నబీఖాన్‌ ప్రత్యేకంగా 150 డోలీలు తయారు చేయించాడు. ఒక్కొక్క డోలీలో నలుగురు సిఫాయిలను ఆయుధాలతో సిద్దవటం కోటకు పంపాడు. వారితోపాటు డోలీలను మోసేందుకు సాయుధులైన ఆ సిఫాయిలను బోయీల వేషంలో పంపాడు. ఫత్తేసింగ్‌ తమ కోటలోకి వచ్చిన డోలీలకు ప్రత్యేకమైన, సురక్షితమైన ప్రదేశాన్ని చూపించాడు. అక్కడ బోయీలు డోలీలను దించారు. కడప పాలకుల అంతరంగిక స్త్రీలకు తాను రక్షణగా నిలిచే అవకాశం లభించిందన్న గర్వంతో ఫతేసింగ్‌ ఆదమరిచి విశ్రమించాడు. అర్దరాత్రి అనంతరం డోలీలలో పరదాల చాటున ఉన్న నబీఖాన్‌ సిఫాయిలు బయటికి వచ్చారు. డోలీలను మోసుకుని వచ్చిన సిపాయిలు కూడా వారితో కలిసి ఒక్కసారిగా కోట నలు దిశలా వెళ్లి ఎక్కడి వారిని అక్కడ ఖైదు చేశారు. ముఖ్యంగా వచ్చిన వారిలో డోలీలో, బోయీల వేషంలో వచ్చిన వారిలో ఒక ప్రత్యేక బృందం ఫతేసింగ్‌ విశ్రమించిన చోటికి వెళ్లి ఆయనపై మెరుపుదాడి చేసి ఖైదు చేశారు. అనంతరం నబీఖాన్‌ పంపిన సిఫాయిలంతా కోటలోని ప్రధాన ద్వరాజాతోపాటు కోట మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దాంతో కోట కడప పాలకుడు నబీఖాన్‌ వశమైంది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top