మెక్కేశారు

మెక్కేశారు - Sakshi


బద్వేలు:

 అవి ప్రభుత్వ కార్యాలయాలు.. వాటిలో పని చేసినా... చేయకపోయినా ఒకటే అని అక్రమార్కులు భావించారు. ఇంకేముంది అందినకాడికి ప్రభుత్వ నిధులను మింగేశారు. చివరకు పోలీస్‌స్టేషన్‌ను కూడా వారు వదలలేదు. రూ.4లక్షల నిధులు వెచ్చించినట్లు రికార్డులు తయారుచేసి స్వాహా చేశారు. ఈ నిధుల స్వాహా భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



2011-12 ఆర్థిక సంవత్సరంలో పోరుమామిళ్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధి పనులు చేపట్టినట్లు రికార్డులు నమోదు చేసి దాదాపు రూ.23లక్షలను కొందరు స్వాహా చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంపచెట్ల తొలగింపు, ముళ్లపొదలు, చెట్ల వేరు మొద్దులు తొలగింపు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు దాదాపు 1527 క్యూబిక్ మీటర్ల మట్టిని తోలి పోలీస్ స్టేషన్ ఆవరణమంతా చదును చేసినట్లు పేర్కొంటూ రూ.4,34,371లను ఖర్చు చేశామంటూ భారీగా మింగేశారు.



పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎటువంటి పనులు చేయలేదని స్థానిక ఎస్‌ఐ కృష్ణంరాజు నాయక్ పేర్కొంటున్నారు. దాతలు, సబ్బంది చందాలు వేసుకుని స్టేషన్ ఆవరణ చదును చేయడంతోపాటు మొక్కలు నాటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.9.55 లక్షలతో ఉపాధి పనులు చేసినట్లు పేర్కొంటున్నా అక్కడ అసలు పనులే జరగలేదు. ఈ నిధులను స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కంపచెట్లు, ముళ్లపొదల తొలగింపు, మట్టి తోలడం, చదును చేయడం వంటి పనులు చేశామని రికార్డుల్లో నమోదు చేశారు. కానీ నాలుగేళ్లుగా ఇక్కడ చేసిన పనులు ఏమీలేవు.



ఇంత ఖర్చు పెడితే కనీసం ఆటస్థలం కూడా బాగు పడలేదు. రాళ్లు తేలి విద్యార్థులకు ఆసౌకర్యంగా ఉంది. నిధులు ఖర్చు చేశారని తెలిసి కళాశాల సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనులు చేసినట్లు పేర్కొంటూ రూ.43813, పశువైద్యశాలలో పని చేసినట్లు రూ.1,28,689 ఖర్చు చూపి రికార్డుల్లో నమోదు చేశారు. ఇక్కడ జరిగిన పనులు తూతూమంత్రమే. నిధులను మింగేందుకే అవసరం లేని చోట పనులు చేశారని స్థానికులు చెబుతున్నారు.



పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనులతో పాటు మొక్కలను నాటామని పేర్కొన్నారు. కానీ అక్కడిమొక్కలను పట్టణానికి చెందిన పలువురి సహకారంతో పెంచుతున్నామని సిబ్బంది పేర్కొన్నారు. అక్రమార్కులు అక్కడితో ఆగకుండా చివరకు శ్మశానాలను కూడా వదలలేదు. పట్టణ పరిధిలోని పెద్ద బొక్కల గడ్డ శ్మశానంలో రూ.3,08,535తో పనులు చేసినట్లు, ఓఎల్‌ఎఫ్ సమీపంలోని శ్మశానంలో రూ.1,77,347, రామయపల్లె శ్మశానంలో రూ.3,00,734, బ్రహ్మణ శ్మశానంలో రూ.53,294 మేరకు పనులు చేసినట్లు లెక్కల మాయచేసేశారు.



కంపచెట్లు తొలగించినట్లు, మట్టి తొలి చదును చేసినట్లు పేర్కొంటూ రూ.లక్షలు జేబుల్లో వేసుకున్నారు. స్థానిక రాజకీయ నాయకులు అండతోనే సిబ్బంది ఈ పనికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పనులు ముగిశాక రెండు పర్యాయాలు సామాజిక తనిఖీలు జరిగినా ఈ అవినీతి బయట పడకపోవడానికి పెద్దల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. దీంతోపాటు వారికి కూడా అంతోఇంతో సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయి.



ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది పనులు చేసినట్లు తమకు తెలియదని చెబుతుండగా ఉపాధి అధికారులు మాత్రం పనులు జరిగాయని చెబుతుండటం గమనార్హం.. ఈ విషయమై ఏపీఓ వసంతకుమార్‌ను వివరణ కోరగా అక్కడ తాము పనులు చేశామని చెబుతున్నారు. కొన్ని పనుల్లో పూర్తి స్థాయి నిధులను వినియోగించలేదని చెప్పారు. కానీ పనులు పూర్తయినట్లు ఉపాధి హామీ వెబ్‌ైసైట్‌లో ఉంది. విచారణ జరిగితే ఈ పనుల్లోని నిజమేమిటో తెలిసే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top